ఐపీఎల్-3: గిల్లీసేనపై ముంబై ఇండియన్స్ విజయభేరి!

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచెల పోటీల్లో భాగంగా.. సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహించే ముంబై ఇండియన్స్ జట్టు విజయపరంపరను కొనసాగిస్తోంది. గత ఏడాది ఐపీఎల్-2 టైటిల్ విజేత, డిఫెండింగ్ ఛాంపియన్ డెక్కన్ ఛార్జర్స్‌తో శనివారం జరిగిన 33వ లీగ్ మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో గిల్లీసేనపై ముంబై ఇండియన్స్ విజయఢంకా మోగించింది.

ఈ విజయంతో సచిన్ సేన దాదాపు సెమీఫైనల్ ఆశలను సజీవం చేసుకుంది. కానీ హైదరాబాద్ ఫ్రాంచైజీ జట్టు డెక్కన్ ఛార్జర్స్ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓటమిని రుచి చూసింది.

ముంబై ఇండియన్స్ ఆటగాళ్లలో అంబటి రాయుడు (29 బంతుల్లో 55 నాటౌట్:) అర్థ సెంచరీని నమోదు చేసుకుని, ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే సౌరవ్‌ తివారీ (44), సచిన్‌ (35)లు రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.

అనంతరం 178 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన డెక్కన్‌ ఛార్జర్స్‌ 18.2 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. డెక్కన్ ఛార్జర్స్ ఆటగాళ్లలో సైమండ్స్‌ (21) మాత్రమే టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ముంబయి బౌలర్లలో జహీర్ ఖాన్‌, హర్భజన్‌ సింగ్, మెక్‌లారెన్‌, పొలార్డ్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు. అలాగే డెక్కన్‌ ఛార్జర్స్‌ బౌలర్లలో ప్రజ్ఞన్‌ ఓజా మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇకపోతే.. అర్థ సెంచరీతో ముంబై ఇండియన్స్‌ను గెలిపించిన అంబటి రాయుడికి "మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌" అవార్డు దక్కింది.

వెబ్దునియా పై చదవండి