ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో తలపడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. సొంతగడ్డపై శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఫీల్డర్లు కీలకమైన సమయం క్యాచ్‌లను నేలపాలు చేయటంతో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలయ్యింది. ఈ మ్యాచ్‌లోనయినా గెలుస్తుందనుకున్న పంజాబ్ ఓటమిపాలవటంతోపాటు దాదాపు సెమీస్ రేసునుంచి కూడా తప్పుకున్నట్లు అయ్యింది.
ముందుగా టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకొంది. కెప్టెన్ సంగక్కర 45, రవి బొపారా 42 (నాటౌట్), యువరాజ్ సింగ్ 36 పరుగులతో రాణించటంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ ఐదు వికెట్ల నష్టానికి 181 పరుగుల గౌరవనీయమైన స్కోరును చేసింది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్ 19.1 ఓవర్లలోనే పంజాబ్ విధించిన 182 పరుగుల లక్ష్యాన్ని చేధించి, ఘన విజయం సొంతం చేసుకుంది. దీంతో పంజాబ్ వరుసగా ఐదో ఓటమిని చవిచూసింది.
బెంగళూరు జట్టులో కెవిన్ పీటర్సన్ 66 (నాటౌట్) పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్‌ను ఆడగా, విరాట్ కోహ్లీ 42, రాబిన్ ఊతప్ప 22 పరుగులతో రాణించారు. ఇన్నింగ్స్‌ను నిదానంగా ప్రారంభించిన రాయల్స్ జట్టులో కలిస్ 9 పరుగులకే పెవిలియన్ చేరగా, మనీష్ పాండే 29 పరుగుల భాగస్వామ్యంతో పీటర్సన్ జట్టును ఆదుకున్నాడు. ఆ తరువాత కోహ్లీతో జతకట్టిన పీటర్సన్ మూడో వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.
చివరి ఓవర్లలో 4 ఓవర్లలో 48 పరుగులు చేయాల్సిన సమయంలో ఊతప్ప బాధ్యతాయుతంగా చెలరేగి ఆడటంతో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే బెంగళూర్ విజయం సొంతం చేసుకుంది. కాగా.. ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన పీటర్సన్ "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డును దక్కించుకున్నాడు.