ఐపీఎల్-3: ఛాలెంజర్స్‌తో పంజూబ్ కింగ్స్ కీలక పోరు రేపే!

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా చిట్ట చివరి స్థానంలో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్ నటీమణి ప్రీతి జింటా జట్టు కింగ్స్ ఎలెవన్ జట్టుకు శుక్రవారం జరిగే మ్యాచ్ కీలకం కానుంది.

ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయాన్ని నమోదు చేసుకున్న పంజాబ్ కింగ్స్‌, శుక్రవారం మొహాలీలో జరిగే మ్యాచ్‌లో నెగ్గితేనే సెమీస్ ఆశలను సజీవం చేసుకోగలుగుతుంది.

ప్రస్తుతం కేవలం రెండు పాయింట్లతో ఐపీఎల్ పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఐపీఎల్ 31వ లీగ్‌ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్.. రాయల్స్‌తో హోరాహోరీగా పోటీపడే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే మంగళవారం సచిన్ టెండూల్కర్ సేన ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు పటిష్టంగా లేకపోవడం, యువరాజ్ వంటి స్టార్ బ్యాట్స్‌మెన్ పరుగుల కోసం తీవ్రంగా శ్రమించడం వంటి కారణాలతో కింగ్స్ ఈ మ్యాచ్‌లో నెగ్గడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు ఐపీఎల్ మూడో సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించి, మూడో స్థానంలో కొనసాగుతోందన్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి