ఐపీఎల్-3: ఢిల్లీ-డెక్కన్ ఛార్జర్స్‌ల మధ్య కీలక సమరం రేపే!

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచెల పోటీల్లో భాగంగా.. ఆదివారం జరిగే 55వ లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ డెక్కన్ చార్జర్స్- ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ల మధ్య కీలక సమరం జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఐపీఎల్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లడం ఖాయం కావడంతో ఢిల్లీ-డెక్కన్ ఛార్జర్స్‌ల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతం 14 సమానమైన పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్న ఢిల్లీ-డెక్కన్‌లు సెమీఫైనల్ అవకాశాల కోసం గట్టిపోటీని ప్రదర్శించే అవకాశం ఉంది. కానీ ఈ మ్యాచ్‌ ఫిరోజ్ షా మైదానంలో జరగడమే ఇరు జట్లకు పెద్ద తలనొప్పిగా పరిణమించింది.

ఇప్పటివరకు ఢిల్లీ, డెక్కన్ ఛార్జర్స్ జట్లు ఆడిన 13 లీగ్ మ్యాచ్‌ల్లో ఏడింటిలో విజయాన్ని మరో, ఆరింటిలో పరాజయాల్ని నమోదు చేసుకున్నాయి. కానీ నెట్ రన్‌రేట్ వ్యత్యాసంలో ఢిల్లీ మూడో స్థానంలోనూ, డెక్కన్ ఛార్జర్స్ నాలుగో స్థానంలోనూ కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే 55వ లీగ్ మ్యాచ్‌లో గెలిచే జట్టు నెట్-రన్‌రేట్ ఆధారంగా సెమీఫైనల్లోకి ప్రవేశిస్తుంది. దీంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. కానీ గత ఏడాది ఛాంపియన్ డెక్కన్ ఛార్జర్స్.. ఐపీఎల్ మూడో సీజన్‌ సెమీఫైనల్‌కు చేరుకుంటుందా? లేదా గౌతం గంభీర్ సేన డెక్కన్‌పై గెలుస్తుందా? అనేది వేచి చూడాల్సిందే..!.

వెబ్దునియా పై చదవండి