ఐపీఎల్-3 తొలి సెమీస్ పోరు: సచిన్ సేన ఘన విజయం

PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా బుధవారం జరిగిన తొలి సెమీ ఫైనల్ పోరాటంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సేన ముంబయి ఇండియన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్ చేరాలన్ని బెంగళూరు ఆశలను అడియాశలు చేసిన ముంబయి 35 పరుగుల తేడాతో గెలుపొంది, తొలిసారిగా ఫైనల్స్‌లో అడుగుపెట్టింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సచిన్ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించింది. ఓపెనర్లు సచిన్ టెండూల్కర్ 9, శిఖర్ ధావన్ 12 పరుగులతో పెవిలియన్ చేరి నిరాశపర్చినా.. అంబటి రాయులు 40 పరుగులతో రాణించి కాస్తం ఊరటనిచ్చాడు. ఆ తరువాత మిడిలార్డర్‌లో వచ్చిన సౌరభ్ తివారీ 52, పొలార్డ్ 33 పరుగులతో స్కోరు బోర్డును పరుగులెత్తించారు. దీంతో ముంబయి నిర్ణీత ఓవర్లలో భారీ స్కోరును సాధించగలిగింది.

అనంతరం 185 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికల్లా 9 వికెట్లను కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రారంభంలోనే కలిస్ (11), పీటర్సన్ (19)ల వికెట్లను కోల్పోయినా... ద్రావిడ్ (23), ఊతప్ప (13 బంతుల్లో 26)లు చెలరేగి ఆడడంతో ఒకదశలో విజయం దిశగా పరుగులు పెడుతున్నట్టే కనిపించింది. అయితే వీరిద్దరూ వెనువెంటనే ఔటయ్యారు.

ఆ తర్వాత మిగిలిన బెంగళూరు బ్యాట్స్‌మెన్ కూడా చేతులెత్తేయడంతో పరాజయం తప్పలేదు. కుంబ్లే (1)తో కలిసి టేలర్ (31) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ముంబయి ఇండియన్స్ 35 పరుగుల తేడాతో గెలుపొంది, ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. కాగా.. బ్యాటింగ్‌లో సత్తా చాటి, బౌలింగ్‌లో 3 వికెట్లు కూల్చిన పొలార్డ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. డెక్కన్ ఛార్జర్స్, చెన్నయ్ సూపర్‌కింగ్స్‌ల నడుమ గురువారం జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టుతో.. ముంబయి ఇండియన్స్ ఏఫ్రిల్ 25న ఫైనల్స్ తలపడుతుంది.

వెబ్దునియా పై చదవండి