ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సేన విజయపరంపర కొనసాగుతోంది. మంగళవారం ముంబైలో జరిగిన 27వ లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడిన ముంబై ఇండియన్స్, నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ముంబై ఇండియన్స్ (ఏడు మ్యాచ్‌ల విజయాలు, 12 పాయింట్లతో) ఐపీఎల్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ.. సెమీస్‌కు చేరువలో ఉంది.
మరోవైపు కింగ్స్ పంజాబ్ ఆరో ఓటమితో కేవలం రెండు పాయింట్లతో చిట్టచివరిస్థానంలో ఉంది. కాగా పంజాబ్‌కు దాదాపు సెమీస్ అవకాశాలు చేజారిపోయినట్లే.
ముంబై ఇండియన్స్‌తో చివరి వరకు ఉత్కంఠగా జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో షాన్‌మార్ష్ (57: 47 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 163 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి మరో మూడు బంతులు మిగిలుండగానే విజయ లక్ష్యాన్ని చేధించింది.
ఇకపోతే.. పంజాబ్ బౌలర్లలో రవి బొపారాకు మూడు వికెట్లు సాధించారు. అలాగే ముంబై ఇండియన్స్ బౌలర్లలో మలింగ విజృంభించి నాలుగు వికెట్లు పడగొట్టగా, జహీర్ ఖాన్ మూడు వికెట్లు సాధించాడు. కాగా.. పంజాబ్ బౌలింగ్‌ను కట్టడి చేసిన పేస్ బౌలర్ మలింగ (శ్రీలంక)కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.