ఐపీఎల్-3 రెండో సెమీస్: గిల్లీ సేనకు ధోనీ సేన చెక్..!!

PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డీసీ 19.2 ఓవర్లలో 104 పరుగులకే వికెట్లన్నింటినీ సమర్పించుకుని చేతులెత్తేసింది. దీంతో ధోనీ సేన ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

తొలుత టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్‌ను హేడెన్, మురళీ విజయ్‌లు ప్రారంభించారు. రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న హేడెన్ 8 పరుగుల వద్ద హారిస్ బౌలింగ్‌లో సైమండ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం విజయ్ 15 పరుగులవద్ద పెవిలియన్ చేరాడు. తరువాత క్రీజులోకి వచ్చిన రైనా కూడా 2 పరుగులకే వెనుదిరగగా.. 29 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయిన చెన్నై కష్టాల్లో పడిపోయినట్లు అనిపించింది.

అయితే ఆ తరువాత రంగంలోకి దిగిన ధోనీ, బద్రీనాథ్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆపై 30 పరుగుల వద్ద ధోనీ, 37 పరుగుల వద్ద బద్రీనాథ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. చివర్లో అనిరుధ్ ఒక ఫోర్, రెండు సిక్సర్లతో మెరుపులు మెరిపించి వేగంగా 24 పరుగులు సాధించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 142 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. డెక్క్ ఛార్జర్స్ బౌలర్లలో హారిస్ మూడు వికెట్లు తీసుకున్నాడు.

అనంతరం 143 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన డెక్కన్ ఛార్జర్స్ టాప్ ఆర్డర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌లు ఘోరంగా విఫలం చెందటంతో ఓటమిపాలయ్యింది. ముందుగా కెప్టెన్ గిల్‌క్రిస్ట్ 15 పరుగుల వద్ద ఔట్ కాగా, ఆ తరువాత నుంచి వికెట్ల పతనం మొదలయ్యింది. గిబ్స్ 18 సుమన్ 4, రైనా 2, సైమండ్స్ 23, మిశ్రా 2, సుమంత్ 16, హారిస్ 15 పరుగుల వద్ద వరుసగా పెవిలియన్ చేరటంతో రెండోసారి ఫైనల్ చేరాలన్న డిఫెండింగ్ ఛాంపియన్ డీసీ ఆశలు అడియాశలు అయ్యాయి.

చెన్నై బౌలర్లలో బొలింగర్ నాలుగు, జకతి రెండు వికెట్లను పడగొట్టారు. కాగా.. ఈ మ్యాచ్ 4 వికెట్లను తీసి, కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చిన బొలింగర్ "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డును దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో సచిన్ సేన ముంబయి ఇండియన్స్‌తో ధోనీ సేన చెన్నై సూపర్ కింగ్స్ హోరాహోరీ తలపడనుంది. ఫలితం ఎలా ఉంటుందో మాత్రం తెలుసుకోవాలంటే ఆదివారందాకా ఆగాల్సిందే మరి..!!

వెబ్దునియా పై చదవండి