గ్యారీపై జాన్‌రైట్ ప్రశంసల వర్షం

టీం ఇండియా వరుస విజయాలలో కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ పాత్ర ఎంతగానో ఉందని... భారత మాజీ కోచ్ జాన్‌రైట్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐదు సంవత్సరాలపాటు భారత జట్టుకు కోచ్‌గా పనిచేసిన తనకంటే, కిర్‌స్టెనే చాలా మెరుగైన వ్యక్తని రైట్ వ్యాఖ్యానించాడు.

తన కంటే గ్యారీనే కెరీర్‌లో ఎక్కువ పరుగులు స్కోర్ చేశాడనీ.. అంతేగాకుండా ఆయన మంచి ఆలోచనాపరుడని, ఆటపై సరైన దృక్పథం కలిగిన వ్యక్తి అని రైట్ పేర్కొన్నాడు. భారత జట్టు కోచ్ పదవికున్న విశిష్టతను తెలుసుకుని, ఆ బాధ్యతను ఓ ఘనతగా భావించి సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడని సంతోషం వ్యక్తం చేశాడు.

కోచ్‌గా కొన్ని వ్యూహాలు మనకు ఉన్నప్పటికీ... అవి ఆటగాళ్లకు ఎంతమేరకు సరిపోతాయి, ఎలాంటి ఫలితాలను ఇస్తాయనే విషయంపై దృష్టి పెట్టాలని చెప్పిన రైట్, ఈ విషయంలో గ్యారీ పూర్తిగా విజయం సాధించాడని మెచ్చుకున్నాడు. గ్యారీ సహాయక సిబ్బంది ప్యాడీ ఆప్టన్, రాబిన్ సింగ్, వెంకటేశ్ ప్రసాద్‌లు కూడా చక్కగా ఉపయోగపడుతున్నారని, అందరూ కలసి ఒక ప్రొఫెషనల్ బృందంలాగా పని చేస్తున్నారని పొగడ్తల జడివానను కురిపించాడు.

ఇదిలా ఉంటే... ధోనీ సేన నెంబర్‌వన్ కావాలంటే, పెద్ద జట్లపై బాగా రాణించాలనీ జాన్‌రైట్ సూచించాడు. సచిన్ బ్రాడ్‌మన్ కోవలోకి వస్తాడవీ, అతడిలో అంత సామర్థ్యం ఉందని అన్నాడు. సచిన్‌లో గొప్ప స్ఫూర్తి ఉందనీ, అతడెప్పుడూ క్రికెట్‌ను ప్రేమిస్తూనే ఉండాడని చెప్పాడు. తాను కోచ్‌గా ఉన్నప్పుడు జహీర్ నేర్చుకునే దశలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు వరల్డ్‌లోనే టాప్ 3 లేదా 4 బౌలర్లలో ఒకడిగా ఎదిగినందుకు సంతోషంగా ఉందని ఈ మాజీ కోచ్ వెల్లడించాడు.

వెబ్దునియా పై చదవండి