ట్వంటీ20 టోర్నీల రాకతోనే సంప్రదాయ టెస్ట్ క్రికెట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయిందని.. ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తక్కువ వ్యవధిలోనే ముగిసే ఈ ట్వంటీ20 మ్యాచ్‌లపైనే అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు.
ప్రముఖ క్రికెట్ మ్యాగజైన్ విస్డన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాంటింగ్ మాట్లాడుతూ.... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఐల్) లాంటి టోర్నీల రాకతో టెస్ట్ క్రికెట్ పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉందని హెచ్చరించాడు. డబ్బుతో పాటు తక్కువ సమయంలో ఖ్యాతిని తెచ్చిపెట్టే ట్వంటీ20 మ్యాచ్‌లపై యువ ఆటగాళ్లు సైతం దృష్టి సారించే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పాడు.
ఇటీవలి కాలంలో ట్వంటీ20కి లభిస్తున్న ఆదరణను గమనించినట్లయితే... ఐదు రోజులపాటు జరిగే టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లు రాన్రానూ గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడం మాత్రం ఖాయమనిపిస్తోందని రికీ వ్యాఖ్యానించాడు. భవిష్యత్తులో ఏ క్రికెటర్ అయినా 150 టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే అదో పెద్ద సంచలనమే అవుతుందని పేర్కొన్నాడు.