దక్షిణాఫ్రికాలో ఐపీఎల్ టోర్నీ: లిలిత్ మోడీ

బుధవారం, 25 మార్చి 2009 (09:02 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్ టోర్నీకి దక్షిణాఫ్రికా గడ్డ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీని నిర్వహించేందుకు క్రికెట్ సౌతాఫ్రికా సమ్మతించింది. దీంతో ఐపీఎల్ పోటీల నిర్వహణ వేదికగా దక్షిణాఫ్రికాను ఖరారు చేసినట్టు ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ మంగళవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు.

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టోర్నమెంట్‌ను ఇతర దేశానికి తరలించాలని భారత క్రికెట్‌ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయించిన విషయం తెలిసిందే. తొలుత ఈ టోర్నీని ఇంగ్లండ్‌లో నిర్వహించాలని భావించారు. అయితే ఏప్రిల్‌, మే నెలల్లో ఇంగ్లండ్‌ వాతావరణం మ్యాచ్‌లకు అనుకూలంగా ఉండదని భావించి వేదికను దక్షిణాఫ్రికాకు మార్చినట్టు ఆయన పేర్కొన్నారు.

ఏప్రిల్ 18 నుంచి మే 24వ తేదీ వరకు జరిగే ఈ పోటీల తేదీల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. దక్షిణాఫ్రికాలోని ఆరు వేదికల్లో టోర్నమెంట్‌ జరుగుతుందని ఐపిఎల్‌ నిర్వాహకులు తెలిపారు. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం టోర్నీ ఏప్రిల్‌ 10 నుంచే ప్రారంభంకావల్సి ఉంది.

అయితే వేదికల మార్పు వల్ల వారం రోజులు ఆలస్యంగా పోటీలను ప్రారంభిస్తున్నారు. అన్ని మ్యాచ్‌లు ముందుగా నిర్ణయించిన భారత కాలమానం ప్రకారమే జరుగుతాయి. తొలి మ్యాచ్‌ సాయంత్రం 4 నుంచి, రెండో మ్యాచ్‌ రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతోంది.

వెబ్దునియా పై చదవండి