నేపియర్‌లో కివీస్ హవా: ఫాలోఆన్ ఉచ్చులో భారత్

నేపియర్ టెస్టులో న్యూజిలాండ్ క్రమంగా పట్టు బిగిస్తున్న నేపథ్యంలో భారత్ ఫాలోఆన్ ఉచ్చులో పడే ప్రమాదం కనిపిస్తోంది. మూడోరోజు ఆటలో ఇప్పటికే 6 వికెట్లు కోల్పోయిన భారత్ కేవలం 250 పై చిలుకు పరుగులు మాత్రమే సాధించింది. ఈ నేపథ్యంలో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 420 పరుగులు దాటని పక్షంలో ఫాలోఆన్ ఆడాల్సిఉంది.

ఈ పరిస్థితుల్లో టీ మూడోరోజు టీ విరామం తర్వాత ఆట కొనసాగిస్తున్న భారత్ ప్రస్తుతం 6 వికెట్ల నష్టానికి 255 పరుగుల వద్ద కొనసాగుతోంది. దినేశ్ కార్తీక్ (0), వీవీఎస్ లక్ష్మణ్ (59)లు క్రీజులో ఉన్నారు. న్యూజిలాండ్ తరపున వెటోరీ, పటేల్‌లు రెండేసి వికెట్లు సాధించగా, మార్టిన్, రైడర్‌లో చెరో వికెట్ సాధించారు.

అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 79 పరుగులతో మూడోరోజు ఆట ప్రారంభించిన భారత్ మరోసారి తడబడింది. అర్ధసెంచరీకి దగ్గరైన సమయంలో సచిన్ (49) వెనుదిరగడంతో భారత్ తన నాలుగో వికెట్ కోల్పోయింది. అటుపై అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని జోరుమీదున్న ద్రావిడ్ (83)ను రైడర్ ఔట్ చేయడంతో భారత్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది.

ద్రావిడ్ తర్వాత యువరాజ్ సింగ్ (0) డకౌట్ కావడంతో ఆరో వికెట్ కోల్పోయిన భారత్ ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 170 పై చిలుకు పరుగులు సాధించాల్సి ఉండడం గమనార్హం. రెండో టెస్టులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 619 పరుగుల భారీ స్కోరు సాధించి డిక్లెర్ చేసిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి