నేపియర్ టెస్టు: ఓపెనర్లను కోల్పోయిన భారత్

నేపియర్‌లో జరుగుతున్న రెండోటెస్టులో న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 619 పరుగుల భారీస్కోరు సాధించింది. రైడర్ (201) డబుల్ సెంచరీ సాధించడంతో పాటు టైలర్ (151), మెక్‌కలమ్ (115)లు సెంచరీ సాధించడం, కెప్టెన్ వెటోరీ (55) అర్థ సెంచరీ సాధించడంతో కివీస్ తొమ్మిది వికెట్ల నష్టానికి 619 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది. భారత్ తరపున జహీర్‌ఖాన్, ఇషాంత్‌శర్మలు మూడేసి వికెట్లు చొప్పున సాధించగా, హర్భజన్ రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

అటుపై తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కేవలం 78 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుని కష్టాలకు ఎదురీదుతోంది. ఓపెనర్లు సెహ్వాగ్ (34), గంభీర్ (16)లు తక్కువ పరుగులకే వెనుదిరగగా, ఇషాంత్‌శర్మ డకౌట్ అయ్యాడు. దీంతో రెండోరోజు ఆటముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 79 పరుగుల వద్ద కొనసాగుతోంది. ద్రావిడ్ (21), సచిన్ (0)లు క్రీజులో ఉన్నారు.

అంతకుముందు నాలుగు వికెట్ల నష్టానికి 351 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో కివీస్ స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. దీంతోపాటు భారత బౌలర్లు సైతం కివీస్ బ్యాట్స్‌మెన్‌పై ప్రభావం చూపలేకపోయారు.

వెబ్దునియా పై చదవండి