వచ్చే 2011లో జరుగనున్న ప్రపంచ కప్ పోటీలను పాకిస్థాన్ నిర్వహించలేని పక్షంలో 12 మిలియన్ డాలర్ల మేరకు నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. ఈ ప్రపంచ కప్ టోర్నీని భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు కలిసి సంయుక్తంగా నిర్వహించనున్న విషయం తెల్సిందే. అయితే, గత నెలలో లాహోర్‌లోని గఢాపీ స్టేడియం వద్ద శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు జరిగిన దాడుల నేపథ్యంలో పాక్‌లో ప్రపంచ కప్ పోటీల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.
భద్రతను సాకుగా చూపి భారత్‌తో సహా పలు ప్రపంచ దేశాలు పాక్‌లో పర్యటించేందుకు ససేమిరా అంటున్నాయి. దీంతో ప్రపంచ కప్ పోటీలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి కూడా అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు ప్రతినిధి మాట్లాడుతూ ఒక సెమీ ఫైనల్ మ్యాచ్‌తో సహా 16 మ్యాచ్‌లకు పాక్ ఆతిథ్యం ఇవ్వాల్సి వుంది. దీనివల్ల తమ బోర్డు సుమారు 12 మిలియన్ డాలర్ల సొమ్మును ఐసిసి నుంచి పిసిబి పొందుతుందన్నారు.
అయితే, పలు క్రికెట్ జట్లు ఇక్కడ పర్యటించేందుకు నిరాసక్తత చూపుతున్నాయి. ఇటీవల శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు జరిపిన దాడితో పరిస్థితి మరింత విషమంగా మారిందని చెప్పారు. భద్రత కారణంగా పాక్ నిర్వహించే ప్రపంచ కప్ పోటీలను రద్దు చేస్తే ఈ మొత్తం సొమ్మును పాక్ బోర్డు నష్టపోవాల్సి వస్తుందన్నారు. ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా భారత్ 22 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుండగా, పాక్ 16 మ్యాచ్‌లకు, శ్రీలంక, బంగ్లాదేశ్‌లు తొమ్మిదేసి మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.