నేపియర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్, మూడో రోజైన శనివారం మైదానంలో పుంజుకుంటామని టీం ఇండియా పేస్ బౌలర్ జహీర్ ఖాన్ నమ్మకం వ్యక్తం చేశాడు. రెండో రోజున టీం ఇండియా ఆటగాళ్లు ధీటుగా రాణిస్తారని, ప్రత్యర్థి జట్టును హడలెత్తింపజేస్తారని జహీర్ అభిప్రాయపడ్డాడు.
నేపియర్‌లో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. తొలి రోజు నాలుగు వికెట్ల నష్టానికి 351 పరుగులతో.. రెండో రోజు ఉదయం ఆటను కొనసాగించిన కివీస్ ఏడు వికెట్ల నష్టానికి 600 పరుగుల భారీ స్కోరు చేసింది.
ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రైడర్ కెరీర్‌లో, తొలిడబుల్ సెంచరీ నమోదు చేసుకోగా, వికెట్ కీపర్ బ్రెండెన్ మెక్‌కల్లమ్ కూడా సెంచరీ చేశాడు. అలాగే కెప్టెన్ వెటోరి అర్థ సెంచరీతో రాణించాడు. దీంతో కివీస్ జట్టు టీం ఇండియాపై ఆధిపత్యంలో నిలిచింది.
ఈ నేపథ్యంలో.. రెండో రోజు మ్యాచ్ పూర్తయ్యాక జహీర్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. టెస్టు మ్యాచ్‌లలో భారత్ రాణిస్తుందని, ప్రస్తుతానికి న్యూజిలాండ్‌తో జరిగే టెస్టును కైవసం చేసుకునే దిశగా ప్రయత్నిస్తామని జహీర్ అన్నాడు.
శనివారం జరిగే మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్‌ల బ్యాటింగ్ అద్భుతంగా ఉంటుందని, గత ఏడాది లాగానే టెస్టులో టీం ఇండియా ముందంజలో నిలుస్తుందని జహీర్ అన్నాడు. తొలి రెండు రోజుల టెస్ట్ మ్యాచ్‌లలో న్యూజిలాండ్ బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు ధీటుగా రాణించారని జహీర్ చెప్పాడు.