మూడో వన్డే: ఇంగ్లండ్‌పై విండీస్‌ జయభేరీ

కరేబియన్‌ గడ్డపై ఇంగ్లండ్‌‌తో జరుగుతున్న మూడో వన్డేలో వెస్టిండీస్‌ జయభేరి మోగించింది. ఇంగ్లండ్‌‌పై ఎనిమిది వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘనవిజయం సాధించి, ఈ ఐదు వన్డేల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.

ఇకపోతే.. వర్షం కారణంగా మ్యాచ్‌ను 44 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో, తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌‌ 117 పరుగులకే కుప్పకూలింది. టాప్‌ ఆర్డర్‌ స్ట్రాస్‌ (2), పీటర్సన్‌ (3), కాలింగ్‌వుడ్‌ (6), ఫ్లింటాఫ్‌ (0), బోపారా (10), ఒవైషా (17), ప్రియర్‌ (7)లు బ్రిటిష్ జట్టుకు పరుగులు సంపాదించి పెట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు.

ఇదిలా ఉండగా.. ఇంగ్లండ్ 68/8 స్కోరును నమోదు చేసుకున్న తరుణంలో మస్కరెన్హాస్‌ (36), బ్యాటి (17)లు కొద్దిసేపు క్రీజులో ఉండటంతో ఇంగ్లండ్‌ 100 పరుగులు దాటింది. విండీస్‌ బౌలర్లలో బ్రావో నాలుగు, ఎడ్వర్డ్స్ మూడు, పోలార్డ్ రెండు వికెట్లు పడగొట్టారు.

ఇంగ్లండ్ ముందుంచిన 118 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ కేవలం 14.4 ఓవర్లలో విజయం సాధించింది. కెప్టెన్‌ గేల్‌ సిక్సర్ల వర్షం కురిపించాడు. గేల్‌ 43 బంతుల్లో 8 సిక్స్‌లు, 5 ఫోర్లతో 80 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. సిరీస్‌లో నాలుగో వన్డే రేపు జరుగుతుంది. మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ బ్రావో (4/19)కు లభించింది.

వెబ్దునియా పై చదవండి