ఇండియన్ ప్రీమియర్ మూడో సీజన్‌లో టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు యువరాజ్ సింగ్ ఆటతీరు బాగానే ఉందని ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ వెనకేసుకొచ్చాడు. కెప్టెన్సీ చేజారిపోవడంతోనే యువరాజ్ సింగ్ క్రీజులో రాణించలేకపోతున్నాడని వెలువెత్తిన విమర్శల నేపథ్యంలో.. యువీ ఆటతీరుపై మోడీ పూర్తి మద్దతు ప్రకటించారు.
అలాగే యువరాజ్ సింగ్ ప్రదర్శనలో ఎలాంటి తప్పు కనిపించలేదని మోడీ స్పష్టం చేశారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్సీ సారథ్యాన్ని ఆ జట్టు సహ యజమాని నెస్ వాడియా శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కరకు అప్పగించడం ద్వారా యువరాజ్ సింగ్ ఉద్దేశపూర్వకంగా ఆటతీరుపై దృష్టి సారించడంలేదని వస్తోన్న ఆరోపణలు మోడీ ఈ సందర్భంగా కొట్టిపారేశారు.
ఐపీఎల్‌లో ప్రతి ఆటగాడి ప్రదర్శనను గమనిస్తూనే ఉన్నామని మోడీ స్పష్టం చేశారు. ఇందులో యువరాజ్ సింగ్ ప్రదర్శనలో ఎలాంటి తప్పు, మార్పు కనిపించలేదని మోడీ వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. కెప్టెన్సీ చేజారిపోవడంతోనే యువీ ఉద్దేశపూర్వకంగా విఫలమవుతున్నాడనే వార్తలపై యువరాజ్ సింగ్ మరియు ఆ జట్టు ఫ్రాంచైజీ యజమాని, బాలీవుడ్ నటీమణి ప్రీతి జింటాలు ఖండించారు. కెప్టెన్సీ ఇవ్వకపోవడంతోనే యువీ ప్రదర్శన విఫలమైందనే వార్తలపై యువీ మండిపడ్డాడు. క్రీజులో ప్రదర్శనకు.. కెప్టెన్సీకి ముడిపెట్టడం సరికాదని, ఇలాంటి దుష్ప్రచారాలను ఆపాలని మీడియాకు యువీ హితవు పలికాడు.