ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా శనివారం రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మరియు డెక్కన్ ఛార్జర్స్- ముంబై ఇండియన్స్ జట్ల మధ్య పోటీ జరుగనుంది. శనివారం జరిగే 32వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సేన.. శిల్పాశెట్టి ఫ్రాంచైజీ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. చెన్నై వేదికగా జరిగే 32వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో ధోనీ సేన మెరుగ్గా ఆడాల్సి ఉంటుంది.
ఇప్పటివరకు 8 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన రాజస్థాన్ రాయల్స్ నాలుగింటిలో గెలుపును, మరో నాలుగింటిలో ఓటమిని చవిచూసి, మొత్తం 8 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో మూడింటిలో మాత్రమే గెలిచింది. మిగిలిన ఐదు మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. దీంతో ఆరు పాయింట్లు సాధించిన ధోనీ సేన ఆరో స్థానంలో కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో షేన్ వార్న్ సేనతో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే ఐపీఎల్ లీగ్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్‌కు కీలకం కానుంది. ఇంకా ధోనీ సేన సెమీస్ ఆశలను సజీవం చేసుకోవాలంటే.. ఇకపై జరిగే మ్యాచ్‌ల్లో తప్పకుండా గెలుపును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.