రాజీ లేదు.. రాజీనామా లేదు.. నిజాల్ని చెపుతా: మోడీ

PTI
"నేను రాజీకి రావడమా... కలలో కూడా జరుగదు. నేను ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసే ప్రసక్తే లేదు" అంటూ మరోసారి ఐపీఎల్ కింగ్ మోడీ గట్టిగా ట్విట్ ఇచ్చాడు ట్విట్టర్లో. తనను బీసీసీఐ ఎలా తొలగిస్తుందో కూడా చూస్తానని సవాల్ విసిరాడు.

తాను బీసీసీఐ దెబ్బకు బెదిరిపోయి రాజీనామా సమర్పిస్తున్నట్లు కొన్ని వార్తా ఛానళ్లు ప్రచారం చేయడాన్ని ఖండించాడు. అటువంటి పిరికితనం తనలో లేదని వెల్లడించాడు. అయితే కొంతమంది మాత్రం తనను రాజీనామా చేయమని ఒత్తిడి తీసుకవస్తున్న మాట వాస్తవమేనన్నాడు. తనను పదివీభ్రష్టుడ్ని చేసిన నాడు నిజాలేమిటో ప్రపంచానికి చెపుతానని, అప్పటివరకూ నోరు మెదపననీ వెల్లడించాడు.

నిరాధారమైన కథనాలను రాసుకుంటూ మీడియా కూడా తన విశ్వాసాన్ని కోల్పోతున్నదని మీడియాకు చురకలు అంటించాడు. ఏదైనా ఓ వార్త రాసేటపుడు నిజానిజాలను తెలుసుకుని రాయాలని మీడియాకు హితవు పలికాడు. నిరాధారమైన వార్తలను రాయడం ద్వారా మీడియా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనీ, ఆ వార్తలను నమ్మవద్దనీ తెలిపాడు.

నిజమేంటో త్వరలోనే బట్టబయలు చేస్తాననీ, మీడియాలో వచ్చే అభూతకల్పనలను నమ్మవద్దని ట్విట్టర్లో లలిత్ మోడీ రాసుకున్నారు. మొత్తమ్మీద శశి థరూర్ పదవి పుటుక్కున తెంచేందుకు వేదికగా ఉపయోగపడి తనకు శుభం పలికిన ట్విట్టర్‌ను మోడీ పూర్తిగా నమ్ముకున్నారు. తాను చెప్పదలుచుకున్నది ట్విట్టర్ ద్వారానే చెపుతున్నాడు.

ఇదిలావుండగా ఏప్రిల్ 26 తర్వాత మోడీని ఐపీఎల్ ఛైర్మన్ పదవి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కొనసాగే పరిస్థితి లేదనీ, ఆయనను పీకేయడం ఖాయమని విశ్వసనీయ సమచారం.

వెబ్దునియా పై చదవండి