విజయ్ సూపర్ సెంచరీ: రాజస్థాన్‌పై ధోనీసేన ఘనవిజయం

PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా.. శనివారం జరిగిన 32వ లీగ్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహించే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుత విజయం సాధించింది. చెన్నై సూపర్ క్రికెటర్ మురళీవిజయ్‌ (127: 56 బంతుల్లో 8 ఫోర్లు, 11 సిక్స్‌లు) సూపర్ ఇన్నింగ్స్‌తో చెన్నైసూపర్‌కింగ్స్‌ ఘనవిజయం సాధించింది.

రాజస్థాన్‌ రాయల్స్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో ధోనీ సేన 23 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది. విజయ్‌ (127), మోర్కెల్‌ (62: 34 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) విజృంభించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 246 పరుగులు భారీ స్కోరు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో ధోనీ సేన సరికొత్త రికార్డును లిఖించుకుంది. ఇంకా ఐపీఎల్‌లోనే 246 పరుగుల భారీ స్కోరును సాధించిన తొలి జట్టుగా ధోనీ సేన నిలిచింది.

అనంతరం 247 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ ఆటగాళ్లు రాణించినా గెలుపును నమోదు చేసుకోలేక పోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముగిసేసరికి ఐదు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. ఓపెనర్‌ నమాన్‌ ఓజా (94 నాటౌట్‌: 55 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) చివరి వరకు క్రీజులో నిలిచి అద్భుతంగా ఆడినప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు.

ఇకపోతే.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో ప్రేక్షకులను కనువిందు చేసిన విజయ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

వెబ్దునియా పై చదవండి