న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండు టెస్ట్‌లో భారత జట్టు కష్టాల్లో పడటానికి కారణం తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్న వీరేంద్ర సెహ్వాగేనని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు ధీటుగా ఫీల్డింగ్‌ను ఏర్పాటు చేయడంలో సెహ్వాగ్ పూర్తిగా విఫలమైనట్లు మార్టిన్ విమర్శించాడు.
నేపియర్‌లో విలేకరులతో మార్టిన్ మాట్లాడుతూ, రెండో టెస్ట్‌కు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లేకపోవడం భారత జట్టుకు ఎదురుదెబ్బేనన్నాడు. ధోనీ లేని లోటు భారత జట్టులో ప్రస్ఫుటంగా కనిపిస్తోందన్నారు. అదీ సీనయర్లయిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్‌లు మైదానంలో ఉన్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని వ్యాఖ్యానించాడు.
సెహ్వాగ్ కన్నా.. పేస్ బౌలర్ జహీర్ ఖానే ఎక్కువగా ఫీల్డింగ్‌లో మార్పులు చేస్తూ కనిపించాడన్నాడు. మైదానంలో భారత ఫీల్డర్లు రోజంతా జేబులో చేతులు వేసుకుని నిలవడాన్ని బట్టి.. ఈ మ్యాచ్... ఫలితం తేలనిదిగా వారు ముందే నిర్ణయించుకున్నట్లున్నారని తెలిపాడు.