8 గంటల పాటు మోడీని విచారించిన ఐటీ అధికారులు!

PTI
కొచ్చి ఫ్రాంచైజీ వ్యవహారంపై ఐటీ శాఖకు చెందిన అధికారులు ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీని 8 గంటల పాటు విచారించారు. కొచ్చి ఫ్రాంచైజీ వివాదంలో పలువురు ప్రముఖుల ప్రమేయం ఉన్నట్లు ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

ఇంకా డబ్బుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఐటీ శాఖకు సమాచారం అందింది. దీంతో ఐపీఎల్ కార్యాలయంపై ఐటీ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఛైర్మన్ లలిత్ మోడీ వద్ద ఐటీ శాఖాధికారులు 8 గంటల పాటు విచారణ జరిపారు. ఐపీఎల్ ద్వారా వచ్చే నగదు, వాటి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా డాక్యుమెంట్లు, ఫ్రాంచైజీ వివరాలపై దర్యాప్తు జరిపారు.

వాఖండే స్టేడియంలోని ఐపీఎల్ హెడ్-క్వార్టర్స్ మరియు మోడీ కార్యాలయం నిర్లోన్ హౌస్‌లోనూ ఐటీ దాడులు జరిగాయి. గురువారం రాత్రి 7.15 నుంచి తెల్లవారుజాము 3.20 గంటల వరకు జరిగిన లలిత్ మోడీ వద్ద ఐటీ అధికారులు విచారణ జరిపారు.

ఈ విచారణ అనంతరం లలిత్ మోడీ విలేకరులతో మాట్లాడుతూ.. ఐటీ అధికారులకు పూర్తి వివరాలను అందజేశామని చెప్పారు. ఇంకా అధికారుల విచారణకు పూర్తి సహకారం అందించామని మోడీ స్పష్టం చేశారు. ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ వివరాలు, వాటి బిడ్ అంశాలను డాక్యుమెంట్లతో అధికారుల ముందుంచామని లలిత్ మోడీ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి