ఆదుకున్న పాంటింగ్: రాణించిన క్లార్క్

శుక్రవారం, 27 ఫిబ్రవరి 2009 (11:05 IST)
జొహెన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆరంభంలోనే ఆస్ట్రేలియా చతికిలబడ్డా.. కెప్టెన్ రికీ పాంటింగ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్, మైఖేల్ క్లార్క్‌ల రాణింపుతో కుదురుకుంది. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి అసీస్ 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేయగలిగింది.

తొలిరోజు ఆట ప్రారంభంలోనే 38 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఆసీస్ కష్టాల్లో కూరుకుపోయింది. అయితే పాంటింగ్, క్లార్క్‌లు బాధ్యతగా ఆడటంతో.. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో జట్టు కాస్తం కుదురుకుంది. ప్రస్తుతం తొలి మ్యాచ్ ఆడుతున్న నార్త్ 47, బ్రాడ్ హాడిన్ 37 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

అంతకు ముందు టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. పేసర్ డేల్ స్టెయిన్ ధాటికి 18 పరుగులకే ఓపెనర్లు ఫిలిప్ హ్యూజెస్ (0), సైమన్ కాటిచ్ (3) పరుగులకు పెవిలియన్ బాట పట్టారు. మోర్కెల్ బౌలింగ్‌లో కాసేపటికే టూడౌన్ మైకేల్ హస్సీ(4) కూడా వెనుదిరిగాడు. మఖయ ఎన్తిని పాంటింగ్‌ను బౌల్డ్ చేసి ప్రమాదకరంగా మారుతున్న పాంటింగ్-క్లార్క్‌ల జోడీని విడగొట్టాడు.

ఇదిలా ఉంటే... పాంటింగ్ 134 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 83 పరుగులు సాధించాడు. కొద్ది పరుగుల తేడాలో క్లార్క్ 90 బంతుల్లో 10 ఫోర్లతో 68 పరుగులు చేసి, స్టెయిన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

వెబ్దునియా పై చదవండి