ఊతప్ప ధాటికి చేతులెత్తేసిన చెన్నై సూపర్ కింగ్స్..!!

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మూడో అంచె పోటీలలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు బ్యాట్స్‌మెన్ ఊతప్ప ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ చేతులెత్తేసి 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఆరు సిక్స్‌లు, మూడు ఫోర్లతో విజృంభించి ఆడిన ఊతప్ప "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డును ఎగరేసుకుపోయాడు. కాగా.. బెంగళూరుకు వరుసగా ఇది నాలుగో విజయం కాగా, చెన్నైకి వరుసగా మూడో పరాజయం కావటం గమనార్హం.

టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి గౌరవప్రదమైన స్కోరును సాధించింది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 135 పరుగులు మాత్రమే చేసి ఓటమిని చవిచూసింది. చెన్నై బ్యాట్స్‌మన్‌లలో బద్రీనాథ్ 31 పరుగులు తప్ప మిగిలిన వారంతా అతి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. బెంగళూర్‌ బౌలర్లు కచ్చితమైన లైన్‌ అండ్‌ లెన్త్‌‌తో బౌలింగ్‌ చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ముఖ్యంగా వినయ్‌కుమార్‌ కీలక సమయంలో 4 వికెట్లను పడగొట్టి చెన్నైని ముప్పతిప్పలు పెట్టాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్యాట్స్‌మన్‌లలో ఊతప్ప మొదట్లో చాలా నెమ్మదిగా ఆడుతూ వచ్చాడు. రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ ఊతప్ప ఆ తర్వాత చెలరేగి పోయాడు. మ్యాచ్ చివర్లో 6 సిక్స్‌లు, 3 ఫోర్లతో కేవలం 38 బంతుల్లో 68 పరుగులు సాధించి స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. ఇక చెన్నై బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్‌ అద్భుత బౌలింగ్‌తో మూడు వికెట్లు తీసాడు.

వెబ్దునియా పై చదవండి