ఐపీఎల్-3: గంగూలీ సేనపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయం!

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా, సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్యచేధనలో సౌరవ్ గంగూలీ సేన మరోసారి బోల్తా పడింది.

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరపున డేవిడ్‌ వార్నర్‌ (107 నాటౌట్‌: 69 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) సూపర్‌ సెంచరీ చేయడంతో పాటు కాలింగ్‌వుడ్‌ (53: 45 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గంగూలీ సేన నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి తొమ్మిది వికెట్లు కోల్పోయి 137 పరుగులకే విఫలమైంది. జట్టులో క్రిస్‌గేల్‌ (30: 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), డేవిడ్‌ హస్సీ (29), మాథ్యూ (24) లు మాత్రమే ఓ మోస్తారుగా రాణించారు. గంగూలీ (5), మన్‌దీప్‌సింగ్‌ (0), మనోజ్‌ తివారీ(0)లు ఘోరంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో మెక్‌డొనాల్డ్‌, యాదవ్‌లు రెండేసి వికెట్లు తీసుకున్నారు.

ఇకపోతే.. ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు విజయం చేకూర్చడంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్‌ వార్నర్‌‌కు "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అవార్డు లభించింది.

వెబ్దునియా పై చదవండి