ఐపీఎల్-3: చెన్నై సూపర్‌కింగ్స్‌కు గంభీర్ సేన షాక్..!!
FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో అంచె పోటీలలో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. చెన్నై చేపాక్ స్టేడియంలో గురువారం రాత్రి రసవత్తరంగా సాగిన ఈ హోరాహోరి పోరులో కెప్టెన్ గౌతం గంభీర్ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్‌తో ఢిల్లీ విజయం సాధించి, సెమీ ఫైనల్స్‌కు మరింత చేరువయ్యింది.
టాస్ గెలిచిన చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మురళీవిజయ్, హేడెన్‌లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. తొలి ఓవర్‌లోనే ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడిన హేడెన్ (1) కాసేపటికే నెహ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన ధోనీ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
ఇక అప్పటి నుంచి చెన్నై క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఫామ్‌లో ఉన్న విజయ్ 17 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అనంతరం రైనా 15, హస్సీ 15, మోర్కెల్ 1, అశ్విన్ 6 బాలాజీ 3, బద్రినాథ్ 30, బొలింగర్ 16 (నాటౌట్) పరుగులతో వెనుదిరిగారు. దీంతో దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 112 పరుగులు సాధించింది.
తరువాత 113 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ కేవలం 18.4 ఓవర్లలోనే నాలుగు వికెట్ల నష్టానికి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ప్రారంభంలోనే 7/3 స్కోరుతో ఢిల్లీ తడబడినా, మన్హస్ 25 (నాటౌట్) సహాయంతో కెప్టెన్ గౌతం గంభీర్ 57 (నాటౌట్) స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్‌తో జట్టు విజయ తీరాలకు చేరింది. కాగా.. ఈ విజయంతో ఢిల్లీ 14 పాయింట్లతో ఐపీఎల్ పట్టికలో మూడో స్థానానికి చేరుకోగా, చెన్నై జట్టు మాత్రం సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసుకొంది.