ఐపీఎల్-3: బెంగళూరుపై నెగ్గిన ముంబై ఇండియన్స్!

PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా శనివారం బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో జరిగిన 52వ లీగ్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ సేన ముంబై ఇండియన్స్ విజయభేరి మోగించింది. స్టేడియంలో సంభవించిన పేలుడుతో 15 మందికి గాయాలు తగిలాయి. పేలుళ్ల అనంతరం ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో సచిన్ సేన 57 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మట్టికరిపించింది.

ఐపీఎల్ సెమీఫైనల్‌కు చేరుకోవడంలో 52వ లీగ్ మ్యాచ్‌ బెంగళూర్‌కు కీలకం కావడంతో హోరాహోరీగా జరుగుతుందనుకున్న మ్యాచ్‌ ఏకపక్షంగా జరిగింది. బెంగళూరు ఆటగాళ్లు ధీటుగా రాణించకపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ పరాజయం పాలైంది. కానీ బెంగళూరు ఓడినప్పటికి నెట్ రన్‌రేట్ (+ 0.219) భారీగా ఉండటంతో రాయల్స్ సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉన్నాయి.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల పతనానికి 191 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లలో అంబటి రాయుడు (46: 27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), డుమిని (42 నాటౌట్‌:19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), మెక్‌లారెన్‌ (40: 42 బంతుల్లో 4 ఫోర్లు)లు రాణించడంతో ముంబై భారీ స్కోరును నమోదు చేసుకోగలిగింది.

అనంతరం 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేసింది. బెంగళూరు జట్టులో విరాట్‌ కోహ్లీ (37: 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మనీష్‌పాండే (16), కలిస్‌ (14), పీటర్సన్‌ (21), ద్రవిడ్‌ (16), ఊతప్ప (4), రాస్‌టేలర్‌ (9)లు వరుసగా విఫలం అయ్యారు. ఇకపోతే.. ఆల్‌రౌండ్‌ ప్రతిభ చూపిన మెక్‌లారెన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

వెబ్దునియా పై చదవండి