ఐపీఎల్-3 సమరం: బెంగళూరుతో సచిన్ సేన 'ఢీ' రేపే..!

PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా శనివారం జరిగే 52వ లీగ్ మ్యాచ్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సేన ముంబై ఇండియన్స్‌.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో ఢీ కొనేందుకు 'సై' అంటోంది.

బెంగళూరులోని ఎమ్. చిన్నస్వామి స్టేడియంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ సేన బెంగళూరుపై హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. ఇప్పటికే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న ఇరు జట్ల మధ్య రసవత్తరమైన పోరు నెలకొంటుందని అభిమానులు వేయి కనులతో ఎదురుచూస్తున్నారు.

కాగా.. ఇప్పటికే సెమీఫైనల్ అవకాశాలను సజీవం చేసుకున్న ముంబై ఇండియన్స్, ఇంకా బెంగళూరు మ్యాచ్‌తో పాటు కేకేఆర్‌తో మరో లీగ్ మ్యాచ్ ఆడాల్సి వుంది. ఇప్పటివరకు 12 ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ 18 పాయింట్లతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ మూడో సీజన్‌లో ముంబై ఆడిన 12 మ్యాచ్‌ల్లో తొమ్మిందిటిలో విజయాలను, మిగిలిన మూడింటిలో పరాజయం చవిచూసింది. ఇంకా మిగిలివున్న రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ ముంబై విజేతగా నిలవాలని భావిస్తోంది.

మరోవైపు.. దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్ రెండో సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ప్రస్తుతం ఐపీఎల్ పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఏడింటిలో గెలిచిన బెంగళూరు, మరో ఆరింటిలో పరాజయం పాలైంది. దీంతో బెంగళూరు 14 పాయింట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.

అయితే గౌతం గంభీర్ నాయకత్వం వహించే ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు బెంగళూరుతో సమానంగా 14 పాయింట్లు, 7 విజయాలు, ఆరు పరాజయాలతో కొనసాగుతోంది. దీంతో శనివారం ముంబైతో జరిగే మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా నెట్‌‌‌‌‌ రన్-రేటు పాయింట్లతో రెండో స్థానాన్ని యథావిధిగా కొనసాగేందుకు బెంగళూరు సాయశక్తులా ప్రయత్నిస్తోంది.

ఒకవేళ ముంబై ఇండియన్స్ చేతిలో బెంగళూరు ఓడితే, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు రెండో స్థానం సొంతమయ్యే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మరి ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో బెంగళూరు నెగ్గుతుందో? లేదో? వేచి చూడాల్సిందే..!.

వెబ్దునియా పై చదవండి