ఐపీఎల్ ట్వంటీ-20: కేకేఆర్-రాజస్థాన్‌ల మధ్య "ఢీ" నేడే!

PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా శనివారం జరిగే 53వ లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్- రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య కీలక సమరం జరుగనుంది. బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ నాయకత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్, షేన్ వార్న్ కెప్టెన్సీ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగే రసవత్తరమైన పోరును వీక్షించేందుకు ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

ఇప్పటివరకు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఫ్రాంచైజీ జట్టు, కోల్‌కతా నైట్‌రైడర్స్ 12 ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌ల్లో ఆడింది. వీటిలో ఐదింటిలో విజయాలను, మిగిలిన ఏడింటిలో పరాజయాలను చవిచూసింది. దీంతో ఐపీఎల్ పట్టికలో కేకేఆర్ పది పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది.

కాగా.. ఐపీఎల్ సెమీఫైనల్లోకి కేకేఆర్ ప్రవేశించాలంటే.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ పుంజుకోవాల్సి ఉంటుంది. కేకేఆర్ ఆటగాళ్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి, జట్టుకు విజయం చేకూర్చినట్లైతే.. అధిక నెట్ రన్‌రేట్‌తో సెమీస్‌లోకి గంగూలీ సేన ప్రవేశించే అవకాశం ఉంది.

కానీ బాలీవుడ్ నటీమణి శిల్పాశెట్టి ఫ్రాంచైజీ జట్టు రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో, ఆరింటిలో విజయం, మరో ఏడింటిలో పరాజయాలతో 12 పాయింట్లు సాధించి, కేకేఆర్‌కు ముందు స్థానంలో ఉంది. దీంతో కేకేఆర్‌పై రాజస్థాన్ రాయల్స్ మెరుగైన ఆటతీరును ప్రదర్శించి, సెమీఫైనల్ అవకాశాలను సజీవం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది.

వెబ్దునియా పై చదవండి