కరేబియన్ గడ్డపై గురువారం జరిగిన ట్వంటీ-20 వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్ మెగా ఈవెంట్‌లో భాగంగా.. దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.
126 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్, ప్రారంభంలో దక్షిణాఫ్రికా యువ బౌలర్ వెల్టన్ బౌలింగ్ ధాటికి తట్టుతోలేకపోయింది. దీంతో తొలి ఓవర్ నాలుగో బంతిలో లంబ్, కెవిన్ పీటర్సన్‌లు వెంట వెంటనే పెవిలియన్ దారి పట్టారు.
ఈ క్రమంలో వెట్టర్‌ను మోనీ మోర్కెల్ అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ తొమ్మిది పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అయితే తర్వాత బరిలోకి దిగిన ఇయాన్ మోర్కన్, కెప్టెన్ కాలింగ్‌వుడ్‌ల అద్భుత భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ 12 ఓవర్లలో 80 పరుగులు సాధించింది. కాలింగ్‌వుడ్ నిలకడగా ఆడి 23 పరుగుల వద్ద అవుటయ్యాడు. మోర్కన్ 62 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 63 పరుగుల వద్ద వెనుదిరిగాడు. చివర్లో లూక్ రైట్, టిమ్‌ల ఆటతీరు జట్టుకు విజయం సంపాదించిపెట్టింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులు సాధించింది. ప్రారంభంలోనే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లు తడబడ్డారు. ఫలితంగా 66 పరుగులకే దక్షిణాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయింది.
మోర్కెల్ (21 బంతుల్లో మూడు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 32 పరుగులు) మాత్రమే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్ చేతిలో దక్షిణాఫ్రికాకు ఓటమి తప్పలేదు.