మణికట్టు గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని.. ఇక క్రీజులో రాణించడమే ఆలస్యమని టీం ఇండియా సూపర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఇంకా క్రీజులో మెరుగ్గా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని యువీ తెలిపాడు. గాయాలతో సతమతమవుతున్న యువరాజ్ సింగ్.. ఐపీఎల్ మూడో సీజన్‌లో అంతగా రాణించలేకపోయాడు.
కానీ కరేబియన్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ పర్వాలేదనింపించాడు. ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత్ తరపున ఆడిన యువరాజ్ సింగ్, 22 బంతుల్లో 23 పరుగులు సాధించాడు. తొలి మ్యాచ్‌లో తన ప్రదర్శనపై యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. గాయాల ఇబ్బందుల తర్వాత ప్రపంచకప్‌లో ఆడటం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఇంకా మణికట్టు గాయం పూర్తిగా కోలుకున్నానని, ఇక ప్రత్యర్థులపై ధీటుగా ఆడుతానని యువీ చెప్పాడు.
మణికట్టు గాయంతో బాధపడిన తాను శస్త్రచికిత్స చేసుకోవడాన్ని వాయిదా వేసుకున్నానని యువీ తెలిపాడు. ట్వంటీ-20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని సర్జరీని వాయిదా వేశానన్నాడు. శస్త్ర చికిత్స చేసుకుంటే ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుందని, అందుకే ట్వంటీ-20 తర్వాత సర్జరీ చేసుకుందామని నిర్ణయించుకున్నట్లు యువీ తెలిపాడు.