గుజరాత్ సీఎం నరేంద్ర మోడీపై కొచ్చి జట్టు విమర్శల వర్షం!

PTI
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై కొచ్చి ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్టు ధ్వజమెత్తింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్‌లో ఆడే కొచ్చి ఫ్రాంచైజీ వివాదంలో ఇంతవరకు ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ, కేంద్ర మంత్రి శశిథరూర్‌లో మాత్రమే కీలక పాత్రలు పోషించారని తెలిసింది. కానీ తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర మోడీపై కొచ్చి ఫ్రాంచైజీ జట్టు ఆరోపించింది.

ఇంకా నరేంద్ర మోడీ ప్రమేయం, ఒత్తిడితోనే లలిత్ మోడీ తమ జట్టుకు వ్యతిరేకంగా చర్యలు చేపడుతున్నారని కొచ్చి జట్టు పేర్కొంది. ఇంకా ఈ విషయమై కొచ్చి జట్టు అధికార ప్రతినిధి సత్యజిత్ విడుదల చేసిన ప్రకటనలో.. అహ్మదాబాద్ కేంద్రంగా ఐపీఎల్ జట్టును వేలం పాటలో ఎంపిక చేయలేకపోవడంతోనే నరేంద్ర మోడీ.. లలిత్ మోడీ ద్వారా తమ జట్టుకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని విమర్శించారు.

ఇదిలా ఉంటే.. లలిత్ మోడీ కొచ్చి ఫ్రాంచైజీ జట్టుకు వ్యతిరేకంగా పలుచర్యలను చేపడుతున్నారని కొచ్చి ఫ్రాంచైజీ జట్టు ఆరోపిస్తోంది. శశిథరూర్, నరేంద్ర మోడీల ఒత్తిడి కొచ్చి ఫ్రాంచైజీ నుంచి యజమానులను తొలగిపోవాల్సిందిగా లలిత్ మోడీ బెదిరిస్తున్నారని ఆ జట్టు ఓనర్లు వాపోతున్నారు. ఇంకా 250 కోట్ల రూపాయలను ఆఫర్ చేసి, కొచ్చి ఫ్రాంచైజీ నుంచి తప్పుకోవాల్సిందిగా కోరుతున్నాడని కొచ్చి జట్టు ఓనర్లు అంటున్నారు.

అయితే ఈ వార్తలను ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ కొట్టి పారేశారు. తనపై ఆధారాలు లేని విమర్శలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి