కరేబియన్ గడ్డపై వచ్చే నెలలో ప్రారంభం కానున్న ట్వంటీ-20 ప్రపంచకప్ వరకు భారత బౌలింగ్ కోచ్‌గా ఎరిక్ సైమన్స్ కొనసాగుతాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ సిరీస్ నుంచి బౌలింగ్ కోచ్‌గా నియమితమైన సైమన్స్ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మరియు వన్డే సిరీస్‌లకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
ప్రస్తుతం ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీ నుంచి వెస్టిండీస్‌లో ప్రారంభం కానున్న ట్వంటీ-20 ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టుకు సైమన్స్ కోచ్‌గానే కొనసాగుతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. దీనికోసం అతని పదవీ కాలాన్ని పొడిగించినట్లు బీసీసీఐ వెల్లడించింది.
ఇకపోతే.. ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల ట్వంటీ-20 మెగా టోర్నమెంట్, మే 16వ తేదీ వరకు జరుగనున్న సంగతి తెలిసిందే.