నా పేలవమైన ప్రదర్శనే కొంపముంచింది: మహేంద్ర సింగ్ ధోనీ

PTI
ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో గురువారం రాత్రి జరిగిన 50వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో తన పేలవమైన ఆటతీరే జట్టు ఓటమికి ప్రధాన కారణమని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. అలాగే ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఫామ్‌లో లేకపోవడం కూడా జట్టు పరాజయానికి మరో కారణమని ధోనీ చెప్పాడు.

క్రీజులో ధీటుగా రాణించే మాథ్యూ హేడెన్‌ గాయానికి గురికావడం, దీనికి తన పేలవమైన ప్రదర్శన తోడుకావడంతోనే గౌతం గంభీర్ సేన ఢిల్లీ డేర్ డెవిల్స్ చేతిలో పరాజయం పాలైయ్యామని ధోనీ వెల్లడించాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన 50వ లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. చెన్నై చేపాక్ స్టేడియంలో గురువారం రాత్రి రసవత్తరంగా సాగిన ఈ హోరాహోరి పోరులో కెప్టెన్ గౌతం గంభీర్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఢిల్లీ డేర్‌డెవిల్స్ సెమీఫైనల్ ఆశలను సజీవం చేసుకుంది.

ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాట్లాడుతూ.. చెన్నై జట్టులో సూపర్ బ్యాటింగ్‌తో రాణించే హేడెన్, గాయం కారణంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధీటుగా రాణించలేకపోయాడని ధోనీ వాపోయాడు.

ఐపీఎల్ సెమీఫైనల్ అవకాశాలపై ధోనీ మాట్లాడుతూ.. ఇక సెమీస్‌లోకి ప్రవేశించడం తమ చేతుల్లో లేదని, డెక్కన్ ఛార్జర్స్‌పైనే అది ఆధారపడి ఉందని అన్నాడు. ఇప్పటికే డెక్కన్ ఛార్జర్స్‌ చేతిలో రెండు మ్యాచ్‌లున్నాయని, కానీ తమకు ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలివుందని ధోనీ చెప్పాడు.

ఇదిలా ఉంటే.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగిన మహేంద్ర సింగ్ ధోనీ కేవలం ఒక్క పరుగు కూడా చేయక, ననేన్స్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరుకున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి