గురువారం సాయంత్రం 8 గంటలకు ముంబయిలో జరుగనున్న ఐపీఎల్-3 రెండో సెమీఫైనల్ పోటీలో చెన్నై సూపర్ కింగ్స్‌తో గిల్‌క్రిస్ట్ కెప్టెన్సీలోని డెక్కన్ ఛార్జర్స్ పోటీ పడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి ఫైనల్‌లోకి దూసుక వెళ్లాలని గిల్లీ సేన ఎండను సైతం లెక్క చేయక ముంబయిలోని డాక్టర్ డి.వై. పాటిల్ యూనివర్శిటీలో ప్రాక్టీసు చేస్తోంది.
బ్యాటింగ్‌కు దిగిన గిల్లీ సహచర ఆటగాళ్లతో తనకు అత్యంత వేగమైన బంతులను వేయాల్సిందిగా కోరాడు. దీంతో రెచ్చిపోయిన ఓ బౌలర్ గిల్లీ బ్యాట్‌పైకి మెరుపు వేగంతో బంతిని విసిరాడు. దూసుకొస్తున్న బంతిని చూసిన గిల్లీ పళ్లను పటపటా కొరుకుతూ శక్తికొద్దీ ఒక్కటి పీకాడు.
అంతే బంతి చుక్కల్ని చూస్తూ నెట్‌ను దాటుకుని ఆవల ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకిస్తున్న ఓ అమ్మాయి నుదిటిపై తగిలి రక్తాన్ని చిందించింది. ఈ పరిణామంతో గిల్లీ బ్యాటూ గీటూ అన్నీ ఆవల వేసి హుటాహుటిన ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలింప జేశాడు.