నేనెందుకు రాజీనామా చేయాలి?!!: లలిత్ మోడీ ప్రశ్న

PTI
శరద్ పవార్ స్వయంగా లలిత్ మోడీకి ఉద్వాసన పలకబోతున్నట్లు వచ్చిన వార్తలను ఐపీఎల్ కమిషనర్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. పైపెచ్చు తనపై వచ్చిన విమర్శలన్నీ నిరాధారమైనవని కొట్టి పారేస్తున్నారు. అంతేకాదు... తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఐపీఎల్ కమిషనర్ పదవి నుంచి వైదొలగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

దుబాయ్ నుంచి తిరిగి రాగానే తను రాజీనామా సమర్పించబోతున్నట్లు మీడియాలో ప్రచారం జరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదనీ, పనిగట్టుకుని కొంతమంది అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు.

కాగా మోడీ రాజీనామా చేయడం ఖాయమనీ, ఆయన బాధ్యతలను బీసీసీఐ చీఫ్ శశాంక్ మనోహర్ అదనంగా చేపడతారని మీడియాలో ఇప్పటికే ప్రచారం జరిగింది. మరోవైపు వ్యవసాయ శాఖామంత్రి, కాబోయే ఐసీసీ అధ్యక్షుడు శరద్ పవార్ సైతం మోడీ ముందు మరో దారి లేదని పరోక్షంగా రాజీనామా తప్పదని తేల్చి చెప్పారు. అయితే బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్‌లో అందరం కలిసి ఉమ్మడిగా మోడీపై వ్యవహారంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

ఇదిలావుంటే లలిత్ మోడీ ఈ రాత్రికి ఢిల్లీ చేరుకుని శరద్ పవార్‌తో భేటీ అవుతారని విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశంలో పవార్, లలిత్ మోడీని రాజీనామా చేయమని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత సమాచారాన్ని బట్టి మోడీ రాజీనామాకు ససేమిరా అనవచ్చని అర్థమవుతోంది.

అటువంటి పరిస్థితుల్లో మోడీపై తీసుకోవలసిన చర్యలపై పవార్ ఇప్పటికే ప్రధానమంత్రితో సహా చిదంబరం, ప్రణబ్ ముఖర్జీలతో చర్చించారు. మొత్తమ్మీద చూస్తే.. మోడీ చేత ఎలాగైనా రాజీనామా చేయించేందుకు తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి