బ్రిడ్జ్‌టౌన్ టెస్ట్ : ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్

వెస్టిండీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో... ఆరు వికెట్ల నష్టానికి 600 పరుగులు సాధించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కాగా, ఇంగ్లండ్ ఆటగాడు రవి బోపరా 104 పరుగులు సాధించి జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించాడు.

ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ ఆట ముగిసే సమయానికి కేవలం ఆరు పరుగులకే ఓపెనర్ క్రిస్‌గేల్ వికెట్ కోల్పోయి 85 పరుగులు సాధించింది. ప్రస్తుతం స్మిత్ 37, శర్వాణ్ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు.

అంతకుముందు... 301/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ 41 పరుగుల వద్ద పీటర్సన్‌ వికెట్‌ను త్వరగా కోల్పోయింది. ఆ తర్వాత కాలింగ్‌వుడ్‌ 159 బంతుల్లో 12 ఫోర్లతో 96 పరుగులతో... రవిబోపరా 143 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 104 పరుగులు సాధించి జట్టు స్కోరును ముందుకు నడిపించారు.

జట్టు భారీ స్కోరుకు ఆసరాగా నిలిచిన బోపరా ఎడ్వర్డ్స బౌలింగ్‌లో టేలర్‌కు క్యాచ్ వెనుదిరిగిన వెంటనే... 600/6 వద్ద ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ స్ట్రాస్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. కాగా, విండీస్ బౌలర్లలో ఎడ్వర్డ్స్ మూడు.. పావెట్, బెన్, టేలర్లు తలా ఒక వికెట్‌ను తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి