రేపటి నుంచి భారత్-కివీస్ రెండో టెస్టు ఆరంభం

కివీస్‌లో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు గురువారం ఆరంభంకానుంది. వన్డే సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకున్న "టీమ్ ఇండియా" మూడు టెస్ట్‌ల సిరీస్‌లోనూ 1-0 తేడాతో ఆధిక్యాన్ని సాధించిన విషయం తెల్సిందే. ఈ టెస్ట్ సిరీస్‌ను కూడా మరో టెస్ట్ మిగిలి ఉండగానే రెండో టెస్ట్‌లో విజయం సాధించాలనే పట్టుదలతే ధోనీ సేన ఉన్నారు.

మరోవైపు స్వదేశంలో వరుస వైఫల్యాలు న్యూజిలాండ్‌ను కలవరపరుస్తుంటే, చారిత్రక విజయం కోసం భారత జట్టులో నుతనోత్సాహన్ని ఉరకలేస్తూ సమరానికి సిద్ధంగా ఉంది. మరోవైపు కివీస్‌ను ఆటగాళ్ళ గాయాలు, ఫామ్ లేమి వెంటాడుతోంది. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌తో పాటు సీమ్‌ ట్రాక్‌లపై రాణిస్తున్న బౌలింగ్‌ భారత జట్టును దుర్భేద్యమైన జట్టుగా మార్చింది.

దీంతో స్వదేశీ అనుకూలతలెన్ని ఉన్నా కివీస్‌కు ముచ్చెమటలు తప్పడం లేదు. మాస్టర్‌ బ్లాస్టర్ సచిన్‌ ముందుండి బ్యాటింగ్‌ చేస్తుంటే.. టాప్‌ ఆర్డర్‌ పరుగుల వరద పారిస్తోంది. దీంతో 41 ఏళ్ల నిరీక్షణకు తెరపడే అవకాశముంది. వన్డేల్లో చెలరేగిన సెహ్వాగ్‌ ఇంకా టెస్టుల్లో తనదైన ఇన్నింగ్స్ ఆడలేదు.

పర్యాటక జట్టు ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతో తమ పిచ్‌లపై గెలుస్తుంటే.. ఎటూ పాలుపోని స్థితిలో ఆతిథ్య కివీస్ జట్టు ఉంది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ భారత జట్టు విజృంభిస్తుంటే ప్రేక్షకపాత్ర పోషించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. కీలక బౌలర్‌ ఓబ్రియన్‌, బ్యాట్స్‌మెన్ ఫ్లెన్‌ గాయాలు జట్టుకు ప్రతికూలంగా పరిణమించాయి.

వెబ్దునియా పై చదవండి