ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఛైర్మన్ లలిత్ మోడీకి అండగా నిలిచేవారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. నిన్నటి వరకు విజయ్ మాల్యా లలిత్ మోడీకి మద్దతు ప్రకటించగా.. నేడు శిల్పాశెట్టి కూడా మోడీది "చైల్డ్ మైండ్" అంటూ సపోర్ట్ చేసింది. తాజాగా పాకిస్థాన్ క్రికెటర్, ట్వంటీ-20 కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా లలిత్ మోడీకి అండగా నిలిచాడు.
ఛైర్మన్ పదవి నుంచి లలిత్ మోడీ తప్పుకుంటే.. ఐపీఎల్ తీవ్రంగా నష్టపోతుందని షాహిద్ అఫ్రిది అన్నాడు. లలిత్ మోడీ అవకతవకలపై మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో..? తెలియదు కానీ.. మోడీ ఛైర్మన్ పదవికి స్వస్తి పలికితే మాత్రం ఐపీఎల్‌కు తీవ్ర నష్టం తప్పదని అఫ్రిది జోస్యం చెప్పాడు. ఐపీఎల్ ద్వారా క్రికెట్‌ను ప్రపంచ దేశాలకు కొత్తకోణంలో చూపించిన లలిత్ మోడీ ఆ పదవి నుంచి తప్పుకుంటే ఐపీఎల్‌కు దెబ్బేనని షాహిద్ అఫ్రిది అభిప్రాయం వ్యక్తం చేశాడు.
కాగా.. ఈ ఏడాది ఐపీఎల్ వేలంపాటలో పాకిస్థాన్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఎంపిక చేయకపోవడంతో షాహిద్ అఫ్రిది అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వేలం పాటలో ఎంపిక చేయకపోవడం ద్వారా ఐపీఎల్ పాక్ ఆటగాళ్లను అవమానించిందని అఫ్రిది గతంలో వ్యాఖ్యానించాడు. ఐపీఎల్లో వేలం సాగిన తీరు మమ్మల్ని నిరాశకు గురిచేసిందని, ఇలా చేయడం ద్వారా పాకిస్తాన్‌తో పాటు క్రికెటర్లను కూడా పరిహసించారని అఫ్రిది అన్నాడు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ ఐపీఎల్ క్రీడలో ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మోడీ అవకతవకలపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన సంగతి విదితమే.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 26వ తేదీన జరుగనున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో ఐటీ ఆధారాలకు అనుగుణంగా లలిత్ మోడీని ఐపీఎల్ యాజమాన్యం ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే లలిత్ మోడీ మాత్రం తాను ఏ తప్పూ చేయలేదనీ, ఈ నెల 26వ తేదీన బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్‌లో అసలు నిజాలను బయట పెడతానని అంటున్నారు.