వన్డేల్లోనూ ఇలాగే ఆడతా : మెక్‌కల్లమ్

టీం ఇండియాతో జరగబోయే ఐదు వన్డేల సిరీస్‌లో కూడా చెలరేగి ఆడతానని న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ బ్రెన్‌డన్ మెక్‌కల్లమ్ స్పష్టం చేశాడు. భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల ట్వంటీ 20 సిరీస్‌ను కైవసం చేసుకున్న సంతోషంలో ఉన్న... మెక్‌కల్లమ్, ట్వంటీ20 మ్యాచ్‌ల్లో ప్రదర్శించిన ఆటతీరునే వన్డేల్లో కూడా చూపిస్తానని అంటున్నాడు.

కాగా, శుక్రవారం జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లను ముప్పతిప్పలు పెట్టిన మెక్‌కల్లమ్, చివరి ఓవర్లో అతను కొట్టిన రెండు బౌండరీలే ఆ జట్టు విజయానికి కారణమయ్యాయన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని కివీస్ కెప్టెన్ వెటోరీ మాట్లాడుతూ... మెక్‌కల్లమ్ బ్యాటింగ్ అద్భుతమని ప్రశంసించాడు.

అంతేగాకుండా... తమ జట్టులోని బౌలర్లు కూడా చక్కని ప్రదర్శన కనబర్చుతున్నారనీ... టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు కూడా బాగా రాణిస్తున్నారనీ మెక్‌కల్లమ్ సంతోషం వ్యక్తం చేశాడు. తమ ప్రదర్శనను మరింతగా మెరుగుపరచుకొని వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలంటే... మరింతగా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇన్నింగ్స్ విజయం సాధించాలంటే, అందుకు తగిన సాధన కూడా చాలా ముఖ్యమని మెక్‌కల్లమ్ వ్యాఖ్యానించాడు. రెండు ట్వంటీ20 మ్యాచ్‌లలోనూ తన ప్రదర్శన బాగానే ఉన్నందుకు ఆనందంగా ఉందనీ, ఇదే దూకుడును రాబోయే సిరీస్‌లోనూ ప్రదర్శిస్తానని ఆయన మరోసారి పునరుద్ఘాటించాడు.

వెబ్దునియా పై చదవండి