కేంద్ర మంత్రి శశి థరూర్‌కి రహస్య అజెండా ఉందని ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ ఆరోపించారు. కొచ్చి ఫ్రాంచైజీ వివాదాన్ని రద్దాంతం చేయడం వెనుక శశిథరూర్ రహస్య అజెండానే ప్రధాన కారణమని లలిత్ మోడీ ధ్వజమెత్తారు.
కొచ్చి ఫ్రాంచైజీ వివాదంలో ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ- కేంద్ర మంత్రి శశిథరూర్‌ల విమర్శల పర్వం కొనసాగుతోంది. ఐపీఎల్ ఛైర్మన్ చేసే ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదంటూ కేంద్ర మంత్రి శశిథరూర్ కొట్టి పారేస్తున్న తరుణంలో.. లలిత్ మోడీ తిరిగి థరూర్‌పై ఆరోపణలకు దిగారు.
కొచ్చి ఫ్రాంచైజీ విషయంలో శశిథరూర్ వేరొక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారనీ, దానికి ఐపీఎల్ నిబంధనల ప్రకారం అంగీకరించకపోవడంతోనే ఈ వివాదాన్ని సాగదీస్తున్నారని మోడీ విమర్శించారు. కొచ్చి ఫ్రాంచైజీ జట్టును అబుదాబికి తరలించేందుకు శశిథరూర్ రంగం సిద్ధం చేస్తున్నారని మోడీ చెప్పారు.
కానీ ఐపీఎల్‌ను విదేశీల్లో నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం కావడంతో అనుమతికి నిరాకరించినట్లు మోడీ వెల్లడించారు. దీంతో కొచ్చి ఫ్రాంచైజీ వివాదాన్ని రద్దాంతం చేస్తున్నారని లలిత్ మోడీ ఆరోపించారు. శశిథరూర్ ఆరోపణలను ధీటుగా ఎదుర్కోవడానికి తాము అన్ని విధాలా సిద్ధమవుతున్నామని మోడీ అన్నారు.
ఇంకా శశిథరూర్ తన రహస్య అజెండాతో వివాదాన్ని వేరొక మలుపు తిప్పాలని చూస్తున్నారని మోడీ చెప్పుకొచ్చారు. కానీ దీనికి తాము త్వరలోనే ఫుల్‌స్టాఫ్ పెట్టేందుకు సిద్ధమవుతున్నామని ఆయన వెల్లడించారు.