పాకిస్థాన్ రావిల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ తిరిగి జట్టులోకి చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు పాక్ జట్టు కోచ్ ఇంతికాబ్ ఆలమ్ వెల్లడించారు. త్వరలో యూఏఈలో ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే సిరీస్ కోసం పాక్ జట్టులో అక్తర్ స్థానం సంపాదించిన విషయం తెలిసిందే.
కరాచీలో విలేకరులతో ఇంతికాబ్ మాట్లాడుతూ, ఇప్పటికే ఫిట్నెస్ పరీక్షలో నెగ్గిన అక్తర్ తన అత్యుత్తమ ప్రతిభతో జట్టు బలాన్ని పెంచనున్నాడని తెలిపారు. ఏప్రిల్ 22 నుండి మే 7 వరకు ఆస్ట్రేలియా-పాక్ వన్డే సిరీస్ జరుగుతుందని వ్యాఖ్యానించారు.
కాగా, పాక్లో శ్రీలంకతో జరిగిన హోం సిరీస్లో మొదటి రెండు వన్డేల్లో పేలవ ప్రదర్శనతో అక్తర్ ఉద్వాసనకు గురయ్యాడు. ఆ తర్వాత కొంత కాలానికి మోకాలి గాయం శస్త్రచికిత్సకు వెళ్లిన ఈ వివాదస్పద బౌలర్ ప్రస్తుతం పూర్తిగా కోలుకుని తిరిగి జట్టులోకి వస్తుండటం విశేషమని పీసీబీ వర్గాలు తెలిపాయి.