సెమీఫైనల్ ఆశలు ఎప్పుడో చేజారిపోయాయి..!: సంగక్కర

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌ సెమీఫైనల్లోకి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్రవేశించే అవకాశాన్ని ఎప్పుడో కోల్పోయిందని ఆ జట్టు కెప్టెన్ కుమార సంగక్కర అన్నాడు. దీంతో సెమీఫైనల్‌పై తమ ఆశలు అడియాశలయ్యాయని సంగక్కర వాపోయాడు.

ఐపీఎల్-3లో భాగంగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో ఐపీఎల్ పట్టికలో చిట్టచివరి స్థానంలో కొట్టుమిట్టాడుతున్న పంజాబ్, సెమీఫైనల్లోకి ప్రవేశించే అవకాశాన్ని కూడా చేజార్చుకుంది.

ఈ సందర్భంగా కెప్టెన్ సంగక్కర మీడియాతో మాట్లాడుతూ.. సెమీఫైనల్ ఆశలు ఎప్పుడో చేజారిపోయాయని చెప్పాడు. అయితే ఇకపై జరిగే ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌ల్లో తమ జట్టు గెలుపును నమోదు చేసుకునే దిశగా ఆడుతుందని సంగక్కర తెలిపాడు.

రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టు ఆటగాళ్లు మెరుగైన ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమయ్యారని సంగక్కర అన్నాడు. కానీ తదుపరి మ్యాచ్‌ల్లో గెలవాలనే ఆకాంక్షతో కింగ్స్ తలపడతారని కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇంకా బ్రెట్‌లీ బౌలింగ్‌పై సంగక్కర మాట్లాడుతూ.. శుక్రవారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ బౌలర్ బ్రెట్‌లీ ప్రత్యర్థి జట్టుకు 25 పరుగులు అందించడంపై కెప్టెన్ సమర్థించుకున్నాడు. ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్‌ను పడగొట్టేందుకు బ్రెట్‌లీ సాయశక్తులా ప్రయత్నించాడని, కానీ అనవసరంగా ప్రత్యర్థి జట్టుకు పరుగులను సమర్పించుకోవాల్సి వచ్చిందని సంగక్కర చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి