ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడటంకంటే.. దేశానికి ప్రాతినిధ్యం వహించడమనేదే తనకు ముఖ్యమని ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు ఆండ్ర్యూ ఫ్లింటాఫ్ స్పష్టం చేశాడు. ఇప్పటికే ఫ్లింటాఫ్ ఐపీఎల్‌కు దూరం కానున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఫ్లింటాఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తుంటి గాయంతో బాధపడుతున్న ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్ ప్రస్తుతం... వెస్టిండీస్-ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ మధ్యలో స్వదేశానికి వెనుదిరిగి వచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగే యాషెష్ సిరీస్‌కు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండేందుకుగానూ.. తాను ఐపీఎల్‌కు దూరం అయ్యేందుకు కూడా వెనుకాడనని ఫ్లింటాఫ్ తేల్చి చెప్పాడు.
ఇదిలా ఉంటే... ఐపీఎల్‌లోని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ, ఫ్లింటాఫ్‌ను 1.55 మిలియన్ డాలర్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసిన సంగతి విదితమే. అయితే... త్వరలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్ జట్టులోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని ఫ్లింటాఫ్ చెబుతున్నాడు.
ఈ సందర్భంగా ఫ్లింటాఫ్ మాట్లాడుతూ... ఇప్పుడు అందరూ ఐపీఎల్ గురించే మాట్లాడుతున్నారనీ, ప్రస్తుతం ఇదొక హాట్ టాపిక్‌గా మారిపోయిందనీ వ్యాఖ్యానించాడు. తాను మాత్రం వచ్చే వన్డే సిరీస్‌లో సొంత జట్టులో ఆడేందుకే ఇష్టపడుతానని చెప్పాడు. ఐపీఎల్‌కు ఇంకొన్ని వారాల సమయం ఉంది కాబట్టి, ఆ విషయంపై తరువాత ఆలోచిస్తాననీ... తనకు ఫిట్‌నెస్ అనుకూలిస్తే మాత్రం మార్చి 10న ఇంగ్లండ్ జట్టులోకి వస్తానని ఫ్లింటాఫ్ ధీమాగా చెబుతున్నాడు.