భారత్ క్రికెట్‌లో మహోంద్ర సింగ్ ధోనీ ఒక మాస్టర్ అని, మైదానంలో తానిచ్చే సలహాలు జట్టుకు చక్కగా ఉపయోగపడతాయని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. కానీ ధోనీ ఎంత విలువైన సలహాలు ఇచ్చినప్పటికీ ఆ సలహాలను అన్నింటినీ తాను పాటించలేనని కోహ్లీ స్పష్టం చేశాడు. సీనియర్ ఆటగాళ్లుగా తమ ఇద్దరి ఆలోచనలు చాలా దగ్గరగా ఉన్న సందర్భాలు చాలా ఎక్కువగా ఉంటాయని, అటువంటప్పుడు ధోని సూచనతో ఏకీభవిస్తాననన్నాడు. కాకపోతే ధోని చేసే ప్రతీ సూచనను అన్ని సందర్భాల్లో అమలు చేసే పరిస్థితి ఉండదన్నాడు.
'మ్యాచ్ లో అనుభవజ్ఞుడైన ధోని సలహాలు తీసుకుంటాను.నేను-ధోని చాలా సందర్బాల్లో ఒకేలా ఆలోచిస్తాం. దాంతో ఎక్కువగా ధోని సూచనతో ఏకీభవిస్తూ ఉంటాను. కాకపోతే ప్రతీది ధోని సలహాపై ఆధారపడను. కొన్నిసార్లు పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు చేస్తుంటాను. ధోని ఒక మాస్టర్. అతనిచ్చే సలహాలు జట్టుకు చక్కగా ఉపయోగపడతాయి' అని శనివారం నెట్ ప్రాక్టీస్ అనంతరం కోహ్లి మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించాడు.
కానీ ఇలా ఒకవైపు ధోనీని పొగుడుతున్నట్లు కనిపిస్తూనే అతడి సలహాలన్నింటినీ తాను పాటించనని, పాటించలేనిని చెప్పడం ద్వారా కోహ్లీ చేసిన వ్యాఖ్య ధోనీని అగౌరవిస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శకులు అంటున్నారు. ధోనీ సలహాలు తీసుకుంటున్నంత మాత్రాన అతడిపై తాను పూర్తిగా ఆధారపడబోనని చెప్పడం ద్వారా కోహ్లీ తన ఆధిక్యతను గర్వంగా ప్రకటించుకున్నట్లయిందని భావిస్తున్నారు.