కంగారులను పరుగెత్తించిన భారత కుర్రకారు...

FileFILE
"మా సొంత గడ్డపై మమ్ములను ఎదుర్కోవడం అంత సులభం కాదు. హేమాహేమీలను మట్టికరిపించాం. నిండా 25 ఏళ్ళ నిండని భారత కుర్రకారుకు ముచ్చెమటలు పట్టిస్తాం" ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు. జగజ్జేతగా నీరాజనాలు అందుకుంటున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్. భారత క్రికెటర్లను పలు విధాలుగా కవ్వించినా.. దూషించినా.. బాక్సింగ్‌కు రమ్మని సవాల్ విసిరినా.. ఇలా ఎన్నో రకాలుగా ఉసిగొల్పినా భారత యువసేన బెంబేలెత్తలేదు. ఆసీస్‌ క్రికెటర్ల సవాళ్ళకు తమ స్వశక్తితోనే తగు సమాధానం చెప్పారు. క్రికెట్ మైదాన రింగ్‌లో వారి కంటే పై చేయి సాధించారు. ఫలితం... కెప్టెన్ రికీ పాటింగ్‌కే కాకుండా ఆసీస్ క్రికెట్ జట్టుకు గర్వ భంగం జరుగగా యువ కుర్రకారు ట్రోఫీని కైవసం చేసుకుని విజయగర్వంతో స్వదేశానికి రానుంది.

వివాదాస్పద టెస్టు సిరీస్ తర్వాత...
క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పదంగా మారిన సిరీస్‌గా ఆసీస్ - భారత జట్ల మధ్య జరిగిన గవాస్కర్ - బోర్డర్ సిరీస్. ఈ సిరీస్‌లో కన్నులొట్టపోయిన చందంగా.. ఆసీస్ జట్టు భారత్‌పై 2-1 తేడాతో విజయం సాధించినప్పటికీ.. కంగారు ముఖాల్లో విజయ ఛాయలు ఎక్కడా కనిపించలేదు. కారణం.. సిడ్నీ టెస్టులో ఆసీస్ క్రికెటర్లు, అంపైర్లు కుమ్మక్కై, భారత్‌ను ఛీటింగ్ చేసి గెలుపొందారు. ఈ విషయం యావత్ క్రికెట్ ప్రపంచానికి తెల్సిందే. ఇలా సాగిన ఆ టెస్టు సిరీస్ ఓ ముగిసిన అధ్యాయంలాంటింది. ఆ తర్వాత ముక్కోణపు సిరీస్. ఆసీస్, భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగింది.

కుర్రకారు జోరు.. కంగారుల బేజారు
ముక్కోణపు టోర్నీ లీగ్ పోటీల్లో ఇరు జట్లపై ఆసీస్ పైచేయి సాధించింది. భారత జట్టు పీకలుదాకా తెచ్చుకుని ఆ తర్వాత ఫైనల్‌కు చేరింది. ఇక పోతే శ్రీలంక జట్టు ఆది నుంచి తడబడింది. ఫలితంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ తర్వాత బెస్ట్ ఆఫ్ త్రీ ఫైనల్స్‌గా జరిగిన సిబీ సిరీస్‌లో భారత్ కుర్రాళ్లు అన్ని రంగాల్లో కంగారుల కంటే మెరుగ్గా రాణించారు. మైదానంలో సై అంటే సై అన్నారు. ఆసీస్ ఆటగాళ్ళ కవ్వింపులకు ఏ మాత్రం రెచ్చిపోకుండా సంయమనం పాటించి బంతి, బ్యాటుతో సమాధానం చెప్పారు. ఫలితం.. మూడు మ్యాచ్‌ల ఫైనల్‌లో భారత్ 2-0 తేడాతో విజయఢంకా మోగించింది. ఆసీస్ గడ్డపై కుర్రకారు మరో చరిత్ర సృష్టించింది. 23 ఏళ్ళ తర్వాత ముక్కోణపు టోర్నీని కైవసం చేసుకుంది. ఇలా.. ఆసీస్ ఆటగాళ్లకు గర్వభంగం చేసి... స్వదేశానికి విజయగర్వంతో తిరిగి వస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి