ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత్ - న్యూజిలాండ్ దేశాల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగాల్సివుంది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఈ మ్యాచ్ ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన కివీస్.. 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఆ సమయంలో వర్షం పడటం, అది ఎంతకీ తెరపివ్వక పోవడంతో రిజర్వు డే అయిన బుధవారానికి వాయిదాపడింది.
అయితే, బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో వర్షం మొదలైంది. ఇది కొన్ని గంటల పాటు సాగి, కొద్దిసేపు ఆగి మళ్లీ మొదలు కావొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రిజర్వు డేలో కూడా మ్యాచ్ సాధ్యపడక పోతే భారత్ నేరుగా ఫైనల్‌కు చేరనుంది. న్యూజిలాండ్ జట్టు ఇంటికి వెళ్లనుంది.
అయితే, సెమీ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంపై క్రికెట్ విశ్లేషకులు మరోలా స్పందిస్తున్నారు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నిన్న ఆగిపోయిన మ్యాచ్ వల్ల భారత్‌కు మేలే జరిగిందంటున్నారు. ముఖ్యంగా రెండోసారి భారీ వర్షం మొదలై ఇక మ్యాచ్ కొనసాగే పరిస్థితి లేకపోవడంతో వాయిదా తప్పలేదు.
ఇక మ్యాచ్ నిలిచిపోయే సమయానికి న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. రెండోసారి వర్షం ఆటంకం కలిగించకుండా మ్యాచ్ కొనసాగి ఉంటే డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో భారత్‌కు 20 ఓవర్లలో 148 పరుగుల లక్ష్యం నిర్దేశించే అవకాశం ఉండేది. ఎందుకంటే కనీసం 20 ఓవర్ల ఆటసాగితే ఈ నిబంధన వర్తిస్తుంది.
నిన్నటి మ్యాచ్‌లో అసలే పిచ్ మందగమనంగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిల్యాండ్ తొలి రెండు ఓవర్లలో ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. తొలి పవర్ ప్లేలో ఆ జట్టు ఒక వికెట్టు కోల్పోయి కేవలం 27 పరుగులే చేసింది. దీన్నిబట్టి పిచ్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇక, వర్షం తర్వాత పిచ్ పరిస్థితిలో మరింత మార్పు వచ్చేది. అటువంటి పిచ్‌పై పరుగుల వరద పారించడం అంత ఈజీ కాదన్నది క్రికెట్ పండితుల మాట. పైగా మబ్బుపట్టిన వాతావరణంలో కివీస్ బౌలర్లు స్వింగ్‌తో చెలరేగిపోయే ప్రమాదం ఉండేదని, అదే జరిగితే లక్ష్య సాధన భారత్‌కు కష్టమయ్యేదన్నది వీరి విశ్లేషణ.
మొత్తమ్మీద అభిమానుల ఆశలపై నీళ్లు చల్లకుండా వరుణుడు కాపాడాడు. బుధవారం కూడా వాతావరణంలో పెద్దగా మార్పులేదు. మ్యాచ్ కొనసాగకుంటే ఫర్వాలేదని, కానీ డక్‌వర్త్‌లూయీస్ పద్ధతిలో మాత్రం మ్యాచ్ జరగకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.