తెలంగాణ రాష్ట్రంలో ప్రేమ వ్యవహారం ఓ దళిత యువతి ప్రాణాలు తీసింది. మృతురాలిని ప్రియాంకగా గుర్తించారు. ఆమె మృతిలో అనేక అనుమానాలు ఉన్నాయి. తాజాగా ఈ కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తాజాగా విషయపు సూది ఇచ్చి తన కుమార్తెను చంపేశారంటూ మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది స్థానికంగా సంచలనంగా మారింది.
మృతురాలి తండ్రి రాంబాబు వెల్లడించిన సమాచారం మేరకు.. తన కుమార్తె ప్రియాంకను ప్రేమ పేరుతో కానిస్టేబుల్ రఘునాథ్ గౌడ్ నమ్మించి మోసం చేశాడని, చివరకు పెళ్లికి నిరాకరించడంతో గట్టు మండలం చిన్నోనిపల్లెలోని ఆయన ఇంటిలోనే ఉంటూ తన కూతురు పోరాటం కొనసాగించిందన్నారు.
ఈ నేపథ్యంలో తాను ఈ నెల 3వ తేదీ రాత్రి 9.30 సమయంలో కుమార్తెతో మాట్లాడానన్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఆమె పురుగుల మందు తాగిందని, అంబులెన్స్‌లో గద్వాలకు తీసుకెళుతున్నారని ఓ వ్యక్తి ఫోను చేసి తనకు సమాచారమిచ్చారని రాంబాబు పేర్కొంటున్నారు. మరుసటి రోజు ఉదయం గద్వాల జిల్లా ఆసుపత్రికి చేరుకున్నానని, కదలికలున్నా ఎలాంటి చికిత్స అందించలేదని ఆరోపించారు.
అయితే, గద్వాలకు వస్తున్న అంబులెన్స్‌ను మార్గమధ్యంలో నిలిపి ప్రియాంకకు విషపు సూదిమందు ఇచ్చారని, ఈ విషయాన్ని దారినపోయే ఓ వ్యక్తి ఫొటో తీశారని, దానిని చూపించారు. ఫొటో చూసిన తర్వాత అనుమానాలు బలపడుతున్నాయన్నారు. తన కూతురును పథకం ప్రకారం హత్య చేశారని పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని రాంబాబు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.