స్నేహితురాలి ఇంట్లో బంగారం చోరీ చేసి గోవాలో ఎంజాయ్ చేసిన నటి సౌమ్యశెట్టి..

ఠాగూర్

సోమవారం, 4 మార్చి 2024 (09:32 IST)
స్నేహితురాలి ఇంట్లో విడతలవారీగా కేజీ బంగారాన్ని వర్థమాన సినీ నటి సౌమ్యాశెట్టి చోరీచేసింది. ఈ బంగారాన్ని విక్రయించిన ఆమె.. వచ్చిన డబ్బుతో గోవాలో ఎంజాయ్ చేసింది. ఈ చోరీ కేసు వెలుగులోకి కావడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఆమె నుంచి 57 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విశాఖపట్నంలోని దొండపర్తి ప్రాంతంలోని బాలాజీ రెసిడెన్సీ‌లో ఉంటున్న జనపాల ప్రసాద్ అనే వ్యక్తి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన కుమార్తె మౌనిక 2016లో బీటెక్ చదువుతుండగా యూట్యూబ్ రీల్స్, షార్ట్ ఫిల్మ్‌లలో నటించేంది. ఈ క్రమంలో గోపాలపట్నం సమీపంలోని వెంకటాపురానికి చెందిన సౌమ్యశెట్టితో పరిచయమైంది. కొంతకాలం వీరిద్దరి మధ్య పరిచయం కొనసాగింది. ఆ తర్వాత మౌనికకు వివాహం చేయడంతో ఇద్దరి మధ్య స్నేహం తెగిపోయింది. సౌమ్య కూడా సుజాత నగర్‌లో ఉంటున్న ఒడిశాకు చెందిన బలరాంను పెళ్లి చేసుకుంది. 
 
ఈ క్రమంలో ఇటీవల మౌనికకు పాప పుట్టింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేసింది. ఈ యేడాది జనవరిలో సౌమ్యశెట్టి ఆ పోస్టుని చూసి కామెంట్ పెట్టింది. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ స్నేహం చిగురించింది. దొండపర్తిలోని పుట్టింట్లో ఉంటున్నానని మౌనిక చెప్పింది. సౌమ్యశెట్టి కూడా తాను ఇటీవలే 'ద ట్రిప్' 'యు వర్స్ లవింగ్లీ' సినిమాల్లో నటించానని, మరికొన్ని షాష్ర్ ఫిల్మ్‌లలో నటిస్తున్నట్టు చెప్పింది. ఈ క్రమంలో సౌమ్య పలుమార్లు మౌనిక పుట్టింటికి వెళ్లి వచ్చారు. 
 
ఈనెల 23వ తేదీన యలమంచిలిలోని బంధువుల ఇంట శుభకార్యక్రమం ఉండడంతో మౌనికతోపాటు ఆమె తల్లిదండ్రులు బంగారు ఆభరణాల కోసం బెడ్ రూమ్‌లోని కఫ్ బోర్డును తెరవగా అందులో భద్రపరిచిన బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు. తరచూ ఇంటికి వచ్చి వెళ్లినవారిలో సౌమ్యశెట్టి ఉన్నట్టు చెప్పడంతోపాటు ఆమె పలుమార్లు వాష్‌రూమ్‌కు వెళతానంటూ మాస్టర్ బెడ్రూమ్‌లోకి వెళ్లి డోర్ వేసుకునేదని చెప్పారు.
 
దీంతో పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది. ముందుగా ఆమె బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించి, లావాదేవీలను పరిశీలించారు. ఫిబ్రవరి 6న విశాఖలోని లలితా జ్యువెలరీలో రూ.పది లక్షల విలువైన పాత బంగారం విక్రయించి, కొత్త నగలు తీసుకున్నట్టు గుర్తించారు. అలాగే కురుపాం మార్కెట్లోని 2 బంగారం దుకాణాల వద్ద పాత బంగారం విక్రయించి, ఆ డబ్బుని ఏటీఎం ద్వారా తన ఖాతాలోకి డిపాజిట్ చేసుకున్నట్టు గుర్తించారు.
 
దీంతో సౌమ్య శెట్టిని అదుపులోకి తీసుకుని విచారించగా మొదట తనకేమీ తెలియదని చెప్పింది. పోలీసులు ఆమె లావాదేవీలను బయటపెట్టడంతో నేరాన్ని అంగీకరించింది. బంగారం విక్రయించిన డబ్బులో రూ.4 లక్షలు ఖర్చుపెట్టి గోవాలో ఎంజాయ్ చేశానని, మరో రూ.2 లక్షలు క్రెడిట్ కార్డు అప్పులు కట్టానని, రూ.1.5 లక్షలుతో కారుకు మరమ్మతులు చేయించానని తెలిపింది. ఆమెను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు