అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ.. కన్నతండ్రిని లేపేశారు...

ఠాగూర్

గురువారం, 10 జులై 2025 (09:14 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో కన్నతల్లి, తన ప్రియుడుతో కలిసి ఓ కిరాతక కుమార్తె కన్నతల్లిని చంపేసింది. ఆ తర్వాత రాత్రికి సెకండ్ షో సినిమాకు వెళ్లి వచ్చి.. శవాన్ని క్యాబ్‌లో తీసుకెళ్లి చెరువులో పడేసింది. ఈ ఘాతుకం... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలంలో వెలుగుచూసింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఘట్కేసర్ మండలం ఎదులాబాద్ చెరువులో ఈనెల 7న ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఈతగాళ్లతో వెలికి తీయించారు. ఒంటిపై గాయాలుండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడిని హైదరాబాద్ కవాడిగూడ ముగ్గుల బస్తీకి చెందిన వడ్లూరి లింగం (45)గా గుర్తించారు. 
 
ఆయనకు కల్లుతాగే అలవాటు ఉందని, అందరితో గొడవ పడేవాడని భార్య శారద(40) కుమార్తె మనీషా(25) చెప్పారు. ఈనెల 6న ఇంటి నుంచి వెళ్లినట్టు పోలీసులకు తెలిపారు. వారి మాటలపై అనుమానం వచ్చి చెరువు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. 
 
ఈయన పాతబస్తీలోని ఓ అపార్టుమెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. భార్య జీహెచ్ఎంసీలో స్వీపర్. వీరికి ఇద్దరు కుమార్తెలు.. పెద్ద కుమార్తె మనీషాకు వివాహమైంది. మనీషాకు భర్త స్నేహితుడు, జవహర్ నగర్ బీజేఆర్ నగర్‌కు చెందిన మహ్మద్ జావీద్ (24) తో వివాహేతర బంధం ఏర్పడింది. విషయం తెలియడంతో భర్త వదిలివేశాడు. 
 
ఆమె ప్రియుడితో కలిసి మౌలాలీలో అద్దె ఇంట్లో ఉంటోంది. కుమార్తె మరొకరితో కలిసి ఉండడం నచ్చని లింగం ఆమెతో పలుమార్లు ఘర్షణ పడ్డాడు. తనకు ఇతరులతో వివాహేతర బంధాలున్నాయని అనుమానిస్తూ వేధిస్తున్నాడని తల్లి శారద కుమార్తెతో చెప్పింది. అప్పటికే తనను తిట్టాడని కోపంతో ఉన్న మనీషా తండ్రిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. 
 
ఈ నెల 5న కుమార్తె నిద్ర మాత్రలు తీసుకొచ్చి తల్లికి ఇచ్చింది. వాటిని కల్లుతో కలిపి భర్తకు ఇవ్వడంతో నిద్రలోకి వెళ్లాడు. మనీషా, జావీద్, శారద.. లింగం ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. తర్వాత సెకండ్ షో సినిమాకు వెళ్లి వచ్చి క్యాబ్‌ను బుక్ చేశారు. మృతదేహాన్ని కారు ఎక్కిస్తుండగా డ్రైవర్ అనుమానంతో ప్రశ్నించాడు. కల్లు తాగి మత్తులో ఉన్నాడని చెప్పారు. ఎదులాబాద్ వద్ద దిగారు. అక్కడి నుంచి తీసుకెళ్లి చెరువులో పడేసి ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చారని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్టు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు