తెలంగాణ రాష్ట్రంలో ఓ మహిళ కన్నబిడ్డను కర్కశంగా చంపేసింది. తన మామతో ఏకాంతంగా ఉన్న సమయంలో కుమార్తె చూసింది. ఈ విషయం బయటకు చెపితే తన పరువుపోతుందని భావించిన ఆ మహిళ కుమార్తె అని కూడా చూడకుండా హత్యచేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలానికి చెందిన పాలెపు నరసింహారావు(65) కుమారుడు హరికృష్ణకు, సునీత(32) అనే మహిళతో వివాహమైంది. వీరికి 12 ఏళ్ల కుమార్తె ఉంది. సునీత, తన మామ నరసింహారావుతో వివాహేతర సంబంధం కొనసాగించేది. 2022, ఫిబ్రవరి 8న భర్త హరికృష్ణ ఇంట్లోలేని సమయంలో మామ, కోడలు ఏకాంతంగా ఉండగా కుమార్తె చూసింది.
ఈ విషయం బయటకు పొక్కుతుందన్న అనుమానంతో సునీత తన మామతో కలిసి కన్న కూతురిని మట్టుబెట్టింది. బాలిక కాళ్లు, చేతులు కట్టేసి వైరుతో గొంతుబిగించి అతిదారుణంగా చంపేశారు. హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. బాలికకు ఫిట్స్ వచ్చి కింద పడిపోయిందని నమ్మబలికి స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.
ఖమ్మం తరలించాలని వైద్యులు సూచించటంతో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాలిక చనిపోయిందని నిర్ధారించారు. బాలిక మృతదేహానికి శవ పరీక్ష చేయొద్దని తల్లి, తాత ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో చిన్నారి మెడపై రాపిడి గుర్తించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటి ఎస్ఐ కవిత అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు కేసు నుంచి తప్పించుకునేందుకు గ్రామంలో మరో యువకుడిపై నేరం నెట్టే ప్రయత్నం చేశారు.
తనకు, సదరు యువకుడికి వివాహేతర సంబంధం ఉందని, అతనే చిన్నారిని చంపాడని మామ ప్రోద్బలంతో సునీత పోలీసులకు చెప్పింది. ఆ యువకుణ్ని విచారించగా సునీతతో తనకు వివాహేతర సంబంధం ఉన్నమాట నిజమేనని, కానీ హత్యతో ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. చివరగా సునీతను విచారించగా హత్య విషయం బయటకు వచ్చింది.
ఈ కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి ఎం.శ్రీనివాస్ నిందితులపై మోపిన నేరం రుజువు కావడంతో వారికి జీవిత ఖైదు విధిస్తూ తుది తీర్పు చెప్పారు.